Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఖమ్మం నగరపాలక సంస్థ, సిద్దిపేట, నకేరేకల్,అచ్చంపేట్, జడ్చర్ల, కొత్తూర్ మున్సిపాలిటీలకు సాధారణ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరికొన్ని మున్సిపాలిటీల్లో ఏర్పడ్డ ఖాళీలకు ఆకస్మిక ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించిందని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి. పార్ధసారధి అన్నారు. ఇందుకు సంబంధించిన ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపునకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల నిర్వహణ పూర్తయ్యే వరకు ప్రతి అంశంలో అవసరమైన ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేసుకోవాలని సూచించారు. బుధవారం సంబంధిత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థల), మున్సిపల్ కమిషనర్లతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ..ఎన్నికల ప్రక్రియ మొదలైందన్నారు. కమిషనర్, డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సాదారణ ఎన్నికల సందర్భంగా వివిధ అంశాలకు సంబంధించి, సూచనలు, నియమావళి రూపొందించి ప్రచురించడం జరిగిందని, అవే సూచనలు, నియమ నిబంధనలు ప్రస్తుతం ఎన్నికలకు వర్తిస్తాయని తెలిపారు. ఈ సూచనలకనుగుణంగా ఎన్నికలు నిర్వహించేలా సీడీఎంఏ పర్యవేక్షిస్తారన్నారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, సామాగ్రి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత, బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఇండేలిబుల్ ఇంకు తదితర అంశాలకు సంబంధించి సంబంధిత అధికారులతో సంప్రదించి పర్యవేక్షిస్తారన్నారు. జనవరి 1వ తేదీ వరకు అర్హతగల ఓటర్ల జాబితాను భారత ఎన్నికల సంఘం 15-1-2021 న ప్రచురించడం జరిగిందని తెలిపారు. ఆ జాబితాను టీఈపోల్ సర్వర్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందన్నారు. ఆ జాబితాను ఉపయోగించుకొని ఏప్రిల్ 5వ తేదీన ముసాయిదా వోటరు జాబితా ప్రచురించడం జరిగిందన్నారు. దానిపై అభ్యంతరాలను పరిశీలించి ఏప్రిల్ 11వ తేదీన తుది వోటరు జాబితా వార్డు వారీగా ప్రచురించాలన్నారు. పోలింగ్ స్టేషన్ల గుర్తింపునకు నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని తెలిపారు. వీలైనంత వరకు గతంలో ఉపయోగించిన పోలింగ్ స్టేషన్లనే వాడుకునేలా చూడాలని, ఏప్రిల్ 14వ తేదీన పోలింగ్ స్టేషన్ల తుది జాబితా ప్రచురించాలన్నారు. కోవిడ్-19కు సంబంధించి ప్రత్యేకంగా సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు. వాటిని తప్పనిసరిగా పాటించాలని ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా, భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. శానిటైజర్లు ఏర్పాటు చేయాలన్నారు.
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పాటైన కొత్తూరు మున్సిపాలిటీలో 12వార్డులు ఉన్నాయని, 8వేల 136 మంది ఓటర్లు ఉన్నారని, అదేవిధంగా జల్ పల్లి మున్సిపాలిటీలో 28వ వార్డుకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలకు డ్రాఫ్ట్ ఫోటో ఏలక్టరోల్ డిస్ప్లే చేయడమైనదన్నారు. ఎన్నికల షెడ్యుల్ ప్రకారం ఎన్నికలకై అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ స్టేషన్లను గుర్తించి, పోలింగ్ స్టేషన్లలో విద్యుత్తు, తాగునీటి సౌకర్యం, ర్యాంపు ఫర్నిచర్ అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి పోలింగ్ స్టేషన్లలో శానిటైజర్, కోవిడ్ కిట్లు ఏర్పాటు చేస్తామని, ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు కచ్చితంగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్, సిసి కెమెరాల ఏర్పాటు పోలింగ్ సిబ్బందికై రాన్డమైజేషన్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు.