Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేదలను ఆదుకోని 'ఆసరా'
- పింఛన్ల కోసం పడిగాపులు
- ఏడాదిన్నరగా కొత్త దరఖాస్తులు లేని మోక్షం
- కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
- నిలిచిపోయిన కొత్త పింఛన్ల జారీ
- వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఎదురుచూపులు
- 57ఏండ్లు నిండిన వారికీ పింఛన్లపై లేని స్పష్టత
ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పింఛన్ అందని ద్రాక్షలా మారింది. కొందరికే అన్నట్టుగా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా కొత్త పింఛన్ల మంజూరు నిలిచిపోయింది. ఎన్నికల ముందు చేసిన 57ఏండ్లకే పింఛన్‌పై ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. వాటి ఊసెత్తడం లేదు. పైగా అర్హత కలిగిన 'ఆసరా' కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు ప్రభుత్వం మొండి చేయి చూపుతోంది. దాంతో వారు ప్రభుత్వం వంక ఎదురు చూడక తప్పడంలేదు. పింఛన్ కోసం నిత్యం 'నీబాంచన్' అనే విధంగా కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారిని పట్టించుకునే వారే కరువయ్యారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గత ఎన్నికల ముందు రైతుబంధు, రైతుబీమాతో పాటూ, ఆసరా పింఛన్ల పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత, బీడీ కార్మి కులు, ఒంటిరి మహిళలకు నెలవారీగా పింఛన్లు అందిస్తుంది. 64ఏండ్లు పూర్తి చేసు కున్న వృద్ధులు, వితంతువులు, తదితరులు పిం ఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జిల్లా యంత్రాంగం మండలాల వారీగా అర్హుల జాబితాను గుర్తించి, పింఛన్ల మంజూరు కోసం ఉన్నతాధికారులకు నివేదికను పంపింది. 2019 ఆగస్టు నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఒక్క పింఛను కూడా మంజూరు కాలేదు. ఇవే కాకుండా అన్ని మండలాల నుంచి వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని పరిశీలించి, అర్హత గల వారికి పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది. కొత్త పింఛన్ల మంజూరుపై సర్కారు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో లబ్దిదారులకు ఎటూ పాలుపోవడం లేదు. దాంతో లబ్దిదారులు పింఛన్ల కోసం ఎప్పుడెప్పుడని ఎదురుచూస్తున్నారు. రెండేళ్లు గడుస్తున్న పింఛన్లు మంజూరు కాకపోవడంతో లబ్దిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నెరవేరని ప్రభుత్వ హామీ.. : గత శాసనసభ ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పింఛన్ల చెల్లింపులు పెంచుతామని హామీనిచ్చారు. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించిన వయస్సును సడలిస్తామని వెల్లడించారు. 65ఏండ్లకు ఆసరా పింఛన్లు అందుకునేందుకు అర్హత నిర్ణయించగా, ఆ వయస్సును 57ఏండ్లకు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. గతంలో రూ.1000 చొప్పున పింఛన్ ఇస్తుండగా, వీటిని రూ.2016, వికలాంగులకు రూ.1500 నుంచి రూ.3016కు పెంచి గత జూలై నుంచి అమలు చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులు ఆరు నెలల నుంచి పింఛన్ల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. ఇక 57సంవత్సరాలకు వయసు తగ్గిస్తూ పింఛన్లు మంజూరు చేయాలన్న అంశంపై ప్రభుత్వ నుంచి అధికారులకు ఎలాంటి ఉత్తర్వులు, మార్గదర్శకాలు జారీ కాలేదు.
కొత్త పింఛన్ల ఊసే లేదు... : కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం ఊసెత్తడం లేదు. గత సంవత్సరంలో మండలాల వారీగా అర్హులైన వారిని గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 10వేల మందికి పైగా నూతన పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారికి ప్రభుత్వం ఎప్పుడు పింఛన్లు ఇస్తుందో? ఇవ్వదో అన్న విషయం తెలియడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా నూతన పింఛన్లకు త్వరలోనే మోక్షం కలుగుతుందని ప్రకటించారు. కానీ నేటికీ అధికారులకు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు.
57 ఏళ్లకే పింఛన్‌పై సందిగ్ధం
ప్రభుత్వ హామీ మేరకు 57ఏండ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేయాల్సి ఉంది. గతంలో మండలాల వారీగా లబ్దిదారుల ఎంపికపై విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాటిని ప్రభుత్వానికి నివేదించారు. ఈ పింఛన్లపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.