Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థాయి పెంచుతూ ఉత్తర్వులు
- జిల్లాస్థాయిలో పలు విభాగాలకు బాధ్యతలు
- పనుల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వ నిర్ణయం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ)లో కీలకమైన ఉపాధిహామీ పనులను పర్యవేక్షించే అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్(ఏపీడీ)లను రాష్ట్ర ప్రభుత్వం అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా పేరు మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఒక్క క్లస్టర్కే పరిమితమైన ఏపీడీ పదవిని విస్తరిస్తూ జిల్లా స్థాయి అధికారిగా మార్చింది. ఈ మేరకు 620/ఆర్డీ/అడ్మిన్/2021 నెంబరుతో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీఆర్డీఎలో ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ)లో పనిచేసే అదనపు జిల్లా అధికారి పోస్టుతో సమానంగా ఉపాధిహామీ (ఈజీఎస్) అమలు కోసం ప్రత్యేకంగా అదనపు జిల్లా అధికారులు పనిచేసే వెసులుబాటు కలిగింది.
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం డీఆర్డీఏలో 2016 అక్టోబరు 11న జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)ను విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ 126 పీఆర్అండ్ ఆర్డీ నెంబరుతో ఉత్తర్వులు జారీచేసింది. అప్పటి డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ)గా ఉన్న జిల్లా పోస్టును జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిగా పేరు మార్చింది. రెండు శాఖలు ఏకతాటిపైకి రావడంతో పర్యవేక్షణతో పాటు అదనపు పని భారం పెరిగిందనే అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం తాజాగా ఉపాధి హామీని పర్యవేక్షణలో ఇప్పటి వరకు క్లస్టర్లకు పరిమితమై అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర ్(ఏపీడీ)లుగా కొనసాగుతున్న అధికారులనే జిల్లా పరిధికి స్థాయికి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
బాధ్యతలు ఇవి..
డీఆర్డీఏలో ఐకేపీ, మహిళా సంఘాల బలోపేతం, స్త్రీనిధిలో భాగంగా ఆర్థిక రుణ సౌకర్యాల కల్పన, బ్యాంకుల లింకేజీ, వసూళ్లు, పింఛన్లు, మహిళా సాధికారత, మహిళా పారిశ్రామిక రైతులుగా తీర్చిదిద్దడం.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిచడం, మహిళా సంఘాల సభ్యుల పిల్లలకు వత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు ప్రయివేటు రంగాల్లో స్వయం ఉపాధి చూపించాల్సి ఉంది.
ఉపాధిహామీ పథకం అదనపు డీఆర్వోలు కూలీలకు 100రోజుల పనిదినాలు కల్పించడం, క్షేత్రస్థాయిలో 55రకాల పనులను గుర్తించడం, సామాజిక తనిఖీలు నిర్వహించడం, దుర్వినియోగమైన డబ్బులను రాబట్టడం, బాధ్యులపై చర్యలు తీసుకోవడం ప్రధాన విధి.
నర్సరీలు ఏర్పాటు చేయడంతో పాటు మొక్కలను సంరక్షించడం, పల్లెప్రగతిలో భాగంగా డంపింగ్‌యార్డుల ఏర్పాటు, శ్మశానవాటికల నిర్మాణం వంటి పనులను పర్యవేక్షిస్తారు. దాదాపుగా జిల్లా అధికారికి ప్రత్యామ్నాయంగా పనిచేయాల్సి ఉంటుంది.