Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రౌచర్‌ను ఆవిష్కరించనున్న మంత్రి సబితారెడ్డి
- వివరాలు వెల్లడించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
- ఫార్మాకు భూములు ఇచ్చిన వారికి ఆరువేల ప్లాట్ల కేటాయింపు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేయనున్న మెగా వెంచర్ బ్రోచర్‌ను బుధవారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ఆవిష్కరించనున్నట్టు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తెలిపారు. మీర్ఖాన్పేట-కందుకూరు గ్రామాల మధ్యలో ఫార్మాసిటీ ప్రధాన గేటు ఎదురుగా 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం మెగా వెంచర్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు ప్రతి ఎకరానికి 121 చదరపు గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం గతంలోనే ప్రకటించిందని తెలిపారు. అద్భుతమైన రోడ్లు, డ్రయినేజీ వ్యవస్థ, అధునాతన లైటింగ్ సిస్టం, పాఠశాల, కమ్యూనిటీ భవనాలు నిర్మాణంతో పాటు సకల వసతులతో ఈ వెంచర్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేసి రైతు కుటుంబాలకు అందిస్తుందని చెప్పారు. అభివృద్ధిలో మంచినీటి సౌకర్యం కలిగిస్తుందన్నారు. మొదటి నుండి గృహ నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. భూములు ఇచ్చిన రైతులు ప్రభుత్వమే నేరుగా పాట్లను లాటరీ పద్ధతిన కేటాయించి పత్రాలు అందజేస్తుందని తెలిపారు. రైతులు తమ కుటుంబ అవసరాలకు ఎప్పుడైనా అమ్ముకునే హక్కు రైతులకు కల్పించిందని వివరించారు. మెగా వెంచర్ నిర్మాణం పనులను శరవేగంగా పూర్తి చేసి రైతు కుటుంబాలకు వెంటనే ప్లాట్లు కేటాయించే విధంగా పనులు పూర్తి చేయాలని రాష్ట్ర లేవల్ కమిటీ సమావేశంలో మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
భూముల పరిహారానికి మూడు వందల కోట్లు విడుదల
గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం కోసం మరో రూ.300 కోట్లు విడుదలైనట్టు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు అంగీకార పత్రాలు ఇవ్వనివారు, కోర్టుల్లో కేసులు వేసిన వారు కూడా వెంటనే తన అంగీకార పత్రాలు ఆర్డీవోకు అందజేసి లబ్దిపొందాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు పరిహారం పొందనివారు, ఇప్పుడు ఇచ్చేవారికి పది రోజుల్లోగా నేరుగా వారి ఖాతాల్లో పరిహారం జమ చేయనున్నట్టు తెలిపారు. కోర్టు కేసు వేసిన వారు, ఇప్పటికే అవార్డు జారీ చేయబడిన భూముల రైతులు కూడా తమ అంగీకార పత్రాలు వెంటనే అందజేస్తే వారికి కూడా పూర్తిస్థాయి పరిహారం, ప్లాట్లు, ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. మంత్రి కేటీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుందని వివరించారు. ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు చేరవేయడం, వారికి నష్టం జరగకుండా చూడటం తన బాధ్యతన్నారు. తప్పుడు ప్రచారాలు చేసే వారికి తను వాస్తవాలు చెబుతాన్నారు. ఎమ్మెల్యే వెంట యాచారం జడ్పీటీసీ జంగమ్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకట రమణ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమేష్ గౌడ్ తదితరులున్నారు.