Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
- రూ.3.5 కోట్లతో మున్సిపల్ కార్యాలయ భవనం, రూ. కోటిన్నరతో బటర్ ఫ్లై స్ట్రీట్ లైట్స్, రూ.2 కోట్లతో సమీకత మార్కెట్ భవనానికి శంకుస్థాపనలు
నవతెలంగాణ-కొత్తూరు
భవిష్యత్‌లో కొత్తూరు మున్సిపాలిటీ రూపురేఖలు మారుతాయని, అనేక పరిశ్రమలను కొత్తూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం ఆయన సుడిగాలి పర్యటన చేసి కొత్తూరు, జడ్చర్ల, అచ్చంపేటలో పలు అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొత్తూరు మున్సిపాలిటీలో ఆయన స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎక్సైజ్ శాఖ మత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి రూ. మూడున్నర కోట్లతో మున్సిపల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.కోటిన్నరతో బటర్ ఫ్లై లైట్స్ ఏర్పాటు, రూ.రెండు కోట్లతో సమీకత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. తొలుత ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ పలు రాష్ట్రాల ప్రజలు కేసీఆర్ లాంటి సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథతో కష్ణా నది నీటితో ప్రజల దాహార్తిని తీర్చారన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలను పెంచి పేద పిల్లలు చదువుకునేలా కృషి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేసీఆర్ కిట్లు, రైతుబంధు, రైతుబీమా, పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారన్నారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మానసపుత్రిక రీజినల్ రింగ్ రోడ్డు త్వరలో ఏర్పాటు అవుతుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఉన్న కొత్తూరుకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. కొత్తూరులో ఇప్పటికే అనేక పరిశ్రమలు ఉన్నాయని, త్వరలో మరిన్ని ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. తెలంగాణ వస్తే భూముల ధరలు పడిపోతాయని అసత్య ప్రచారం చేశారని, కానీ నేడు తెలంగాణ వచ్చాక భూముల ధరలు గణనీయంగా పెరిగాయని గుర్తుచేశారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎప్పుడూ సీఎంను కలిసిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు, తాగునీరు తీసుకువచ్చి తమ నియోజకవర్గాన్ని అభివద్ధి చేయాలనే కోరుతున్నారని తెలిపారు. అందుకే పాలమూరు జిల్లా మంత్రులు, శాసనసభ్యులతో మూడు రోజుల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఈ ఏడాదిలోపే పూర్తి చేస్తామని హామీనిచ్చారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల పేద విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలను రెండు వందల నుండి వెయ్యి వరకు ఏర్పాటు చేశామని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రస్తుతం నాలుగు లక్షల 50 వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, ఒక్కొక్క విద్యార్థికి తెలంగాణ ప్రభుత్వం ఏడాదికి లక్షా 20 వేలు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. విదేశాల్లో చదువుకోడానికి డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్, జ్యోతిరావు పూలే పేరుమీద రూ.20 లక్షలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ అమోరుకుమార్, ఏసీపీ కుశల్కర్, జడ్పీ వైస్ చైర్మన్ గణేష్, జడ్పీటీసీలు ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, తాండ్ర విశాల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాదగిరి, ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, నాయకులు శ్యామ్ సుందర్‌రెడ్డి, నారాయణరెడ్డి, అందే బాబయ్య, బతుకు దేవేందర్ యాదవ్, రవినాయక్, మున్నూరు పద్మారావు, గూడూరు సర్పంచ్ సత్తయ్య, మక్తగూడా సర్పంచ్ రాజు, మల్లాపూర్‌తండా సర్పంచ్ రవినాయక్, మల్లాపూర్ సర్పంచ్ సాయిలు, ఎంపీడీవో జ్యోతి, ఇన్చార్జి ఎమ్మార్వో వెంకట్ రామ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వీరేందర్, మేనేజర్ మంజులత, సీఐ భూపాల్ శ్రీధర్, రూరల్ సీఐ సత్యనారాయణలు పాల్గొన్నారు.