Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తూరు
పచ్చి మర్చిని సాగుచేసిన రైతులు ప్రస్తుతం కన్నీరు పెట్టక తప్పడం లేదు. మార్కెట్లలో పచ్చి మిర్చి ధర దారుణంగా పడిపోయింది. యాసంగిలో పచ్చిమిర్చి పండిస్తున్న రైతు కంట కన్నీటినే మిగిల్చింది. గతేడాది వర్షాలు బాగా కురవడంతో బోరు బావులలో నీటి మట్టం బాగా పెరిగింది. దీంతో రైతులు బీరా, బెండ, టమాటో, పచ్చిమిర్చి లాంటి అనేక కూరగాయల పంటలను ఎక్కువగా సాగు చేశారు. మార్కెట్లో కూరగాయల రేట్లు అన్ని దారుణంగా పడిపోవడంతో రైతు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. పచ్చి మిర్చి ధర మార్కెట్లు ఎన్నడూ లేనంతగా కనిష్ట స్థాయికి పడిపోయింది. కిలో మిర్చి ధర ఎన్నడూ లేనంతగా రూ.5కు పడిపోయింది. పచ్చిమిర్చి దిగుబడి ఎక్కువగా వస్తుండడంతో మార్కెట్లో కొనేవారే కరువయ్యారు. దీంతో రైతులు తమ పంటను రోడ్డు పక్కన పార బోస్తున్నారు. పచ్చిమిర్చి సాగు చేయడానికి మిగతా పంటల కంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది. పచ్చిమిర్చి పంటను సాగు చేయడానికి ఎకరాకు సుమారుగా రూ.40 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. మండలంలో గతేడాది 40 ఎకరాల్లో పచ్చిమిర్చి సాగు చేస్తే, ఈ సారి యాసంగిలో 132 ఎకరాల్లో రైతులు పచ్చి మిర్చిసాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. మండలంలోని ఎస్బీపల్లి గ్రామం పచ్చిమిర్చి సాగుకు ప్రత్యేక స్థానంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ గ్రామంలోని రైతులు అందరూ పచ్చిమిర్చిని ఎక్కువగా సాగుచేస్తుంటారు. ప్రస్తుతం యాసంగిలో ఒక్క ఎస్బీపల్లిలోనే 36 ఎకరాల్లో పచ్చిమిర్చిని సాగు చేశారు. ధర తగ్గిపోవడంతో పంటసాగు కోసం చేసిన అప్పును ఎలా తీర్చాలోనని రైతులు దిగులు చెందుతున్నారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇప్పటికి పెట్టుబడే చేతికిరాలె..- అంబటి రామచంద్రయ్య, ఎస్బీపల్లి కౌలు రైతు
నేను కౌలుకు తీసుకొని ఎకరం పొలంలో పచ్చి మిర్చి సాగు చేశాను. పంట బాగానే వచ్చింది. కూలీల కొరత ఉండడంతో కూలీ రేట్లు బాగా పెరిగాయి. పంట సాగు చేయడానికి సుమారు రూ.40 వేల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. పంట కాపు పూర్తి కావస్తున్నా ప్రస్తుతానికి రూ.పదివేల రూపాయలు కూడా రాలేదు. పెట్టుబడైనా తిరిగి వస్తుందో.. లేదోనని దిగులుగా ఉంది.