Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కనీస మద్దతు ధర కరువు
- తెచ్చిన అప్పులు తీరని దుస్థితి
- ఎకరానికి సుమారు రూ.15 వేల ఖర్చు
- వర్షానికి తడిసిన ఉల్లిగడ్డ
- నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
నవతెలంగాణ-తాండూరు రూరల్
ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన ఉల్లి రైతన్నలకు కన్నీరే మిగులుతోంది. పొద్దనక,రాత్రనక కుటుంబాలు కష్టపడి పంటలు పండిస్తే, కనీసం గిట్టుబాటు ధర కూడా రాకపోవడంతో అప్పులపాలవుతున్నారు అన్నదాతలు. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు పెద్దపీట వేస్తామని హామీలు ఇవ్వడం తప్పా, అమలు చేయడంలో విఫలమవుతోంది. బంగారు తెలంగాణ ధ్యేయంగా పని చేస్తామని చెబుతున్న నాయకుల మాటలు 'అందని ద్రాక్ష పుల్లన్న' అన్న చందంగా ఉంది. తాండూరు మండలం గుంత బాసుపల్లి మిట్ట బాసుపల్లిలో ఐనెల్లి, కోటబాస్పల్లిలో తదితర గ్రామాల్లో ప్రతి ఏడాది లాగే, ఈ ఏడాది కూడా 3 వందల ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేశారు. గత నెల రోజుల క్రితం క్వింటాల్ కు రూ.3 వేలు ఉన్న ఉల్లి ధర ప్రస్తుతం రూ.7వందల నుంచి రూ.8వందలకు పలుకుతోంది. పండించిన పంటలు మార్కెట్కు తీసుకెళ్లితే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం ఎంతో ఆశతో పంట సాగు చేసి, అప్పులపాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఎకరా ఉల్లి సాగు చేయాలంటే సుమారు రూ.10 వేల నుంచి రూ. 15 వేల వరకు ఖర్చు వస్తుంది. ఇంటింటిపాది పని చేసి, పంట పండిస్తే, చేతికి వచ్చేసరికీ ఒక్కసారిగా ధరలు పడిపోతున్నాయి. తెచ్చిన అప్పులు మిత్తిలకు పెరుగుతున్నాయి. పంటల ధరలు చూస్తే, కనీసం కష్టపడింది పోయిన పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో ఉల్లి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఉల్లికి కూడా మద్దతు ధర కల్పిస్తే, పండించిన పంటలకు కొంత మేరకైనా లబ్దిపొందుతారు. అంతేకాకుండా ఒక్కొక్క సారి ఒక విధమైన రేటు ఉండటం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్ ధరలు ఎప్పుడు పెరుగుతోందని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న, పంటలు చేతికొచ్చే సమయానికి ధరలు తగ్గుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. రైతున్నలు పండించిన పంటలకు వారే ధర నిర్ణయించుకునే స్థాయికి ఎదిగేలా కృషి చేస్తామన్న ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని పలువురు వాపోతున్నారు. ధర పెరుగుతుందని పంట కోసిన చెల్లెళ్లనే పెట్టుకోవడంతో మంగళవారం రాత్రి అకస్మాత్తుగా వర్షం పడటంతో చాలా మంది రైతుల పొలాల్లో ఉన్న ఉల్లిగడ్డ మొత్తం తడిసిపోయింది. ఉదయాన్నే పొలాల్లోకి వెళ్లి చూస్తే వారికి కన్నీళ్లే మిగిలింది. రైతుల బాధలు దృష్టిలో పెట్టుకుని ఆర్థికంగా ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఉల్లికి కూడా ఒక మద్దతుధరతో పాటు నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం చేయాలని వివిధ గ్రామాల రైతులు కోరుతున్నారు