Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
నూతనంగా ఏర్పాటైన పీర్జాదిగూడ నగర పాలక సంస్థను అన్ని రంగాల్లో అభివద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కమిషనర్ ఎం.శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ లతో కలిసి మంత్రి మాట్లాడారు. రూ.80 కోట్లతో రూపొందించుకున్న కార్పొరేషన్ వార్షిక బడ్జెట్లో రూ.23కోట్లతో పార్కుల అభివద్ధి, శ్మశాన వాటికల్లో మౌలిక వసతుల కల్పన, సీసీ రోడ్ల నిర్మాణం, హరితహారం, డంపింగ్ యార్డు నిర్వహణ, లింకు రోడ్ల విస్తరణ, నూతన రోడ్ల ఏర్పాటు కోసం తీర్మానాలు చేశారని తెలిపారు. అన్ని డివిజన్లను సమగ్రంగా అభివద్ధి చేసేలా కార్పొరేటర్లు, కో ఆప్షన్‌సభ్యులు, అధికారులందరూ ఐక్యంగా కషి చేస్తున్నారన్నారు. ఇంటిగ్రేటేడ్ మార్కెట్ ఏర్పాటుకు మేడిపల్లి రైతు బజార్‌ను ఎంపిక చేసినట్లుగా పేర్కొన్నారు. శానిటేషన్ విభాగంలో పని చేస్తున్న సిబ్బందికి కూడా జీహెచ్ఎంసీలో ఇచ్చే విధంగా వేతనాలు ఇవ్వాలని కోరుతూ సీడీఎంఏ కు ప్రపోజల్ పెట్టామన్నారు.
మిద్దె తోటలు, ఇంకుడు గుంతల ఏర్పాటుకు ప్రోత్సాహం
ఇంటిపై కప్పులో మిద్దె తోటలు ఏర్పాటు చేసుకునే వాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైన ఉందని మేయర్ జక్కా వెంకట్ రెడ్డి అన్నారు. మిద్దె తోటలు నిర్వహిస్తున్న వారికి స్క్వేర్ ఫిట్ కు రూ.10 నుంచి రూ.5 వేల వరకూ తగ్గకుండా ప్రోత్సాహం అందించాలని తీర్మానించామని తెలిపారు. సేంద్రియ ఎరువులతో కూరగాయలు, ఆకుకూరలు పండించడం తద్వారా అరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించేందుకు దోహదపడుతుందన్నారు. కొత్తగా ఇండ్లు నిర్మించుకున్న వారు ఇంకుగుంతలు ఏర్పాటు చేసుకుంటే ఇంటి పన్నులో పది శాతం వరకు సబ్సిడీ ఇచ్చేలా తీర్మానం చేశామని ఆయన పేర్కొన్నారు.