Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంట చేతికొచ్చే సమయంలో ఆందోళన కల్గిస్తున్న చెడగొట్టు వాన
- రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం
- షాద్‌నగర్, యాచారంలో వడగండ్ల వాన
- వరి, మామిడి తోటలకు తీవ్ర నష్టం
- ప్రారంభమైన వరి కోతలు, కల్లాల్లో ధాన్యం
- పంట కాపాడేందుకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టని ప్రభుత్వం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పంట బాగా పడింది. అమ్ముకుని కాస్తో కూస్తో అప్పు తీర్చుకుందామని ఆశపడ్డ రైతుకు మళ్లీ నిరాశే మిగిలింది. ప్రతీ యేడు లాగే ఈసారీ రైతు ఆశలపై వడగండ్లు పడ్డాయి. పంటలు కోసే సమయంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట మొత్తం నేలరాలడంతో చేసిన అప్పు తీర్చేదేట్టా అని లబోదిబోమంటున్నారు. గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మంచాల, షాద్‌నగర్, యాచారం మండలాల్లోని మేడిపల్లి, నందివనపర్తి, నజ్జిక్సింగారం, బొల్లిగుట్టతండ గ్రామాల్లో భారీ వర్షం పడింది. వరి పంట పూర్తిగా దెబ్బతినగా, మామిడి కాయలు నేలరాలాయి.
యాసంగిలో వడగండ్ల బీభత్సం..
కనీసం యాసంగి సాగు గట్టెకుతుందని ఆశగా ఉన్న రైతును మబ్బులు భయపెడుతున్నాయి. మంగళవారం నుంచి గురువారం సాయంత్రం వరకు పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతన్నలకు తీవ్ర నష్టం మిగుల్చుతోంది. యాచారం మండలంలోని మేడిపల్లి, నజ్జిక్సింగారం, నానక్‌నగర్, బొల్లిగుట్టతండ, నందివనపర్తి గ్రామాల్లో తెల్లవారు జామును వడగండ్ల వర్షం రైతులకు కన్నీరు మిగిల్చితే.. సాయంత్రం షాద్‌నగర్‌లో భారీగా కురిసి న వడగండ్ల వర్షం బీభత్సాన్ని సృష్టించింది. పండ్ల తోటలకు కూడా నష్టాన్ని కలిగిస్తుంది. ఈదురు గాలులకు మామిడి నేల రాలుతోంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆరుగా లం కష్టపడిన పంట అరగంటలోనే మాయమైందని మదన పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజాన కురిసిన వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. చెట్లకొమ్మలు విరిగిపడ్డాయి. యాచారం మండలం నజ్దిక్‌సింగారం గ్రామం లో మంగళవారం రాత్రి కురిసిన ఈదురుగాలుల వర్షానికి రెండు ఎకరాల మామిడి తోటలో కాయలు నేలరాలాయి. సుమారు రూ.40వేల ఆస్తినష్టం వాటిల్లింది. మేడిపల్లిలో పడిన వడగండ్ల వల్ల వరి పంట దెబ్బతిన్నదని రైతు రాజిరెడ్డి తెలిపారు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంతో పాటు చుట్టుపక్కల పరసర గ్రామాల్లో మంగళ, బుధవారాల్లో వర్షం నమోదైంది. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. గ్రామాల రోడ్లు జలమయమయ్యాయి.
అందని వానాకాల నష్ట పరిహారం
గత వానాకాలంలో 102,875మంది రైతులకు చెందిన 144097.38ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ఇక యాసంగి ముగుస్తున్నా పరిహారం మాటే లేదు. ప్రస్తతం యాసంగి సాగులో 35,550 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా రైతులు వరికోతలు మొదలు పెట్టారు. ధాన్యాన్ని కల్లాల వద్ద నిల్వ చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో కొనుగోలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో అకాల వర్షాలు రైతులను ఆం దోళనకు గురి చేస్తున్నాయి. గత వారంరోజులుగా ఒక్కసా రిగా వాతావరణం మబ్బులు కమ్ముకున్నాయి. అక్కడక్కడ జల్లులు కూడా పడ్డాయి. కోతదశలో ఉన్న వరి ఈదురు గాలులకు నేలవాలుతోంది. యాచారం మండలంలో ప్రతి ఏడాది యాసంగిలో ఏప్రిల్ మాసంలో తప్పకుండా వడగం డ్లు కురుస్తాయన్నది జగమెరిగిన సత్యం. ఆ నానూడిన నిజం చేస్తూ గురువారం తెల్లవారు జామున కురిసిన వడగండ్ల వర్షం కారణంగా మేడిపల్లిలో వరిపంటకు నష్టం వాటిల్లింది. అయితే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చూస్తే రాళ్ల వర్షం కురువకపోయినా.. ఏ క్షణాన రాళ్ల వర్షం పడుతుందోనని రైతులు ఆందోళన చెందారు. ప్రతీ సంవత్సరం వడగండ్లకు జిల్లాలో పంట నష్టాని చవిచూస్తున్నారు. గత వర్షాకాలం సీజన్లో అధిక వర్షాలకు తీవ్రంగా పంట నష్టం వాటిల్లింది. వరి 30394ఎకరాలు, పత్తి 1,05,201 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. వరికి ఎకరానికి రూ.5,671, పత్తి ఎకరానికి రూ.2,720 చొప్పున పరిహారం అందిచాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. గత సంవత్సరం ఆగస్టులో పూతకు వస్తున్న సమయంలోనే అధిక వర్షాలు పడడంతో పత్తి పూత నేల రాలింది. సెప్టెంబరులో దిగుబడి వస్తుందనుకున్న సమయంలో మళ్లీ వర్షాలు కురవడంతో పంట దెబ్బతింది. వర్షాలు తగ్గినా పత్తి రంగు మారి తెగుళ్లు సోకి దిగుబడి తగ్గింది. వరి నేలవాలి నష్టపరిచింది. పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారులు అంచనా వేసి నివేదికలు పంపించారు.
వడగండ్ల వాన భయం...
రంగారెడ్డి జిల్లాలో మంగళ, బుధవారం, గురుతెల్లవారు జామున కురిసిన అకాల వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు పంటలు దెబ్బతిన్నాయి. చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు 21.6మి.మీ, గండిపేట్ 15.4మి.మీ, మొయినాబాద్ 13. 1మి.మీ, ఫరూక్నగర్ 13.5మి.మీ, శంకర్పల్లి 12.9మి.మీ, చేవెళ్ల 11.4మి.మీ నమోదైంది.