Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నాయకుడు ఆనంద్
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్ బస్‌స్టేషన్‌లో ఉన్న ఉచిత మరుగుదొడ్లను వెంటనే అందుబాటులోకి తేవాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ నాయకులు జిల్లా ఆనంద్ అన్నారు. బస్‌స్టేషన్‌లో ఉచిత మరుగుదొడ్లు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం శంషాబాద్ బస్‌స్టేషన్ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న టాయిలెట్ల వద్ద రంగారెడ్డి జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ బస్‌స్టేషన్ సమస్యల పట్ల శంషాబాద్ ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఆరు నెలల కింద శంషాబాద్ బస్ స్టేషన్లో ఉన్న ఉచిత టాయిలెట్లను తొలగించి వాటి స్థానంలో స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా రూ.ఐదు లక్షల 70 వేలతో ఉచిత టాయిలెట్లను నిర్మించారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ పనులను ప్రారంభించినప్పటికీ నేడు అందుబాటులో లేవన్నారు. ప్రారంభించడం, తర్వాత వదిలేయడం శంషాబాద్ ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. మరుగుదొడ్లను అందుబాటులోకి తేవాలని నాలుగు రోజుల కింద ఫిర్యాదు చేసినప్పటికీ శంషాబాద్ మున్సిపల్ అధికారులు, ఆర్టీసీ అధికారులు ఇప్పటి వరకు స్పందించడం లేదని మండిపడ్డారు. అంతర్జాతీయ విమానాశ్రయం, జాతీయ రహదారి ఔటర్‌రింగ్ రోడ్డు, చందన వెళ్లి ఇండిస్టియల్ ఏరియా, కాటేదాన్ ఇండిస్టియల్ ఏరియా ప్రధాన ప్రాంతంలో ఉన్న శంషాబాద్ స్టేషన్ బస్సుల్లో వేలాది మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇందుకు వెంటనే మరుగుదొడ్లను వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే బస్‌స్టేషన్‌లో కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. లేదంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చందు, శివ, వరుణ్, ధనుష్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.