Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొక్కల సంరక్షణపై అధికారులు, ప్రజాప్రతినిధుల అశ్రద్ధ
- నాటిన ఏడాదిలోపే ఎండుముఖం
నవతెలంగాణ-దోమ
పల్లెల్లో పచ్చదనం పెంపోందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం నీరుగారిపోతున్నది. పేరుకే పచ్చదనం అన్నట్టుగా మారింది. హరితహారం పేరిట యేటా గ్రామాల్లో విస్తతంగా మొక్కలు నాటుతున్నారు. క్షేత్ర స్థాయిలో భారీ మొక్కలు నాటుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి సంరక్షణపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఏడాదిలోపే నాటిన వేల మొక్కలు ఎండిపోతున్నాయి.
సుమారు మూడు లక్షలపైగా మొక్కలు..
మండల పరిధిలోని 36 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు సుమారు మూడు లక్షలకుపైగా మొక్కలు నాటారు. ఈ మొక్కలను ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల్లో, ప్రధాన రహదారుల పక్కన, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఖాళీ ప్రదేశాల్లో నాటారు. కానీ నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేసి నిత్యం నీరందించాల్సిన అవసరం ఉంది. పంచాయతీలో నాటిన మొక్కల సంరక్షణపై గ్రామ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంది. కానీ అలాంటి చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఫలితంగా ఇతర ప్రాంతాల్లో, ప్రధాన రహదారుల పక్కన నాటిన మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. కొన్నిచోట్ల ట్రీ గార్డులు లేక జీవారసులకు మేతగా మారాయి.
మరికొన్ని మంటలో కాలిపోయి..
మండల పరిధిలోని మోత్కూర్ గ్రామ గేట్ సమీపంలో, మహబూబ్ నగర్-పరిగి ప్రధాన రహదారిలో ఇరువైపులా నాటిన మొక్కలు చాలా వరకు మంటలో పూర్తిగా కాలిపోయాయి. కానీ ఇప్పటివరకు అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడాన్ని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. హరితహారంపై అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే పచ్చని చెట్లు ఎండిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. మొక్కలకు వాటర్ ట్యాంకర్ ద్వారా నిత్యం నీరు కూడా అందించక ఇంకొన్ని చనిపోతున్నాయి. ప్రభుత్వం లక్షలు వెచ్చించి మొక్కలు నాటించినా ఫలితం లేకుండా పోతోందని, ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
హరితహారం మొక్కలను కాపాడాలి
రోడ్డుకు ఇరువైపుల నాటిన మొక్కలకు రక్షణ లేదు. ప్రధాన రహదారిలో ఏపుగా పెరిగిన మొక్కలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అధికారులు ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా కాలిపోయిన మొక్కలను తొలిగించి, కొత్త మొక్కలను తిరిగి నాటించాలి. ట్రీగార్డ్స్ ఏర్పాటు చేసి నీరందించాలి.
- ఎన్టీఆర్ శంకర్, మోత్కూర్ గ్రామస్తుడు
నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవు
హరితహారంలోనాటిన మొక్కల సంరక్షణపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధ్యులపై చర్యలు తప్పవు. హరితహారంలో నాటిన మొక్కలకు ప్రతి రోజు నీరందిస్తున్నాం. కాలిపోయిన మొక్కలను పరిశీలించి, కొత్త మొక్కలను నాటే విధంగా కషి చేస్తాం. దీనిపై పూర్తి స్థాయిలో పంచాయతీ సిబ్బంది దృష్టి పెట్టాలి.పెట్టాలి.
- జయరామ్, ఎంపీడీవో