Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఊరును అనుసరించి ఉన్న వరి పంటను పందుల నుంచి కాపాడుకునేందుకు పంట చుట్టూరా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భోనగిరిపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితులు, షాబాద్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆశోక్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు భోనగిరిపల్లి గ్రామానికి చెందిన లింగాల జంగయ్య(60) అదే గ్రామానికి చెందిన ముత్యాల నారాయణ, బుగ్గరాములు పంట పొలాలను కౌలుకు తీసుకుని వరిపంట సాగుచేస్తున్నాడు. సాగు చేస్తున్న వరిపంటపై పందులు దాడిచేసి నష్టపరుస్తున్నాయని నారాయణ గురువారం రాత్రి పంటచుట్టూరా విద్యుత్తీగను ఏర్పాటు చేసి, కరెంటు సరఫరా చేశాడు. తన ఇంటి పనుల నిమిత్తం షాబాద్‌కు వెళ్లి తిరిగి, గురువారం రాత్రి ఇంటికి తిరిగి వస్తూ వరిపంటకు వేసిన విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం పంట పొలానికి వెళ్లిన నారాయణ విద్యుత్ తీగకు తగిలి మృతి చెందిన జంగయ్యను చూచి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబసభ్యులు ఘటన స్థలానికి వెళ్లి భోరున విలపించారు. ఊరును అనుసరించి ఉన్న పంట పొలానికి నిర్లక్ష్యంగా విద్యుత్ తీగలను ఏర్పాటు చేసి, జంగయ్య ప్రాణాలను తీసారని పలువురు ఆరోపించారు. మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుని భార్య లింగాల శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.