Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటాడుతున్న కరోనా మహమ్మారి
- ఆన్లైన్ తరగతులపై విద్యార్థుల అనాసక్తి
- తల్లిదండ్రులూ వదిలేస్తున్న వైనం
- వ్యవసాయ పనులు, కాలక్షేపానికే పరిమితం
- విద్యార్థులను భయపెడుతున్న థర్డ్ వేవ్
- నేటి నుంచి లాక్డౌన్ ఎత్తేసిన ప్రభుత్వం
- జులై ఒకటి నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం
- నవతెలంగాణ, రంగారెడ్డి ప్రతినిధి
రోజురోజుకూ కరోనా మహమ్మారి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా భయపెడు తోంది. దాంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. సుమారు 20 రోజుల పాటూ లాక్డౌన్ విధించిన ప్రభుత్వం తాజాగా నేటి నుంచి ఎత్తేసింది. ఇక ఈ నెల 15 నుంచి ప్రారంభం కావాల్సిన విద్యా సంస్థలు వచ్చే నెల ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి. అయినా విద్యార్థుల చదువులు కొనసాగుతాయన్న నమ్మకం లేకండా పోతోంది. ఏ క్షణాన ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న ఆందోళన విద్యార్థి తల్లిదండ్రుల్లో నెలకొంది. దాంతో విద్యావ్యవస్థ గాడి తప్పింది. ఏడాదిగా అతలాకుతలమవుతోంది. ఆన్లైన్ తరగతుల నిర్వహణకు పరిమితమయ్యారు. ప్రత్యక్ష తరగతుల వలన కూడా విద్యావ్యవస్థ కుంటుపడుతుంటే, ఇక ఆన్లైన్తరగతుల నిర్వహణ ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇదీలా ఉంటే విద్యార్థులకు సరైన అవగాహన లేకపోడం, విద్యార్థుల తల్లిదండ్రులకు అదనపు ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం పడుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఆండ్రాయిడ్ ఫోన్ సౌకర్యం లేకపోవడం, వందలో 10, 20 మంది విద్యార్థులకు ఫోన్ సౌకర్యం ఉన్నా.. సిగల్స్ సరిగ్గా అందక చదువుకు దూరమవుతున్నారు. అనేక ప్రాంతాల్లో సిగల్స్ సరిగ్గా లేక ఆన్లైన్ తరగతులు ఆగమయ్యాయి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో బాసటగా నిలిచారు.
జులై ఒకటి నుంచి ప్రారంభమయ్యేనా..?
ప్రభుత్వం విద్యా సంవత్సరాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభించున్నట్టు గతంలోనే ప్రకటించింది. అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్య పెరగడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ వేసవి సెలవులను ఈ నెల 20వరకు పొడగించింది. దీంతో చిన్నారులు మరో 20 రోజులు చదువులకు దూరమయ్యారు. తాజాగా ప్రభుత్వం ఆదివారం నుంచి లాక్డౌన్ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా విద్యా సంవత్సరాన్ని జులై 1వ తేదీ నుంచి ప్రారంభించాలని ఆదేశించింది. ఆ మేరకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో రైతులు నిమగమయ్యారు. సర్వం రైతులు పొలం బాట పట్టారు. ప్రస్తుతం తరగతులు లేనందున తల్లిదండ్రులతో పాటే విద్యార్థులు కూడా పొలం బాట పడుతున్నారు. వ్యవసాయ పనుల్లో నిమగమయ్యారు. జూన్ మొదటి వారంలో విద్యార్థు లు పుస్తకాలు, పెన్నులు, స్కూల్ డ్రెస్, బ్యాగులు, ఇతరత్రా సామ్రగి కొనుగోలుకు తల్లిదండ్రులతో మారం చేయాల్సిన కాలంలో పొలం బాట పడుతున్నారు. ఒకటవ తేదీ నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తున్నప్పటికీ ఏ మేరకు పాఠశాలలు నడుస్తాయన్నది ప్రశ్నార్థకమనే చెప్పాలి. ఒకవేళ విద్యార్థులు పాఠశాలలకు వస్తున్న సందర్భంగా కేసుల సంఖ్య పెరిగితే మాత్రం మళ్లీ విద్యాసంస్థలు మూతపడే ప్రమాదం లేకపోలేదు.
పాఠశాలకు చేరుకోని పుస్తకాలు..
జిల్లాలోని 21 మండలాల్లో అన్ని యజమాన్యాల కింద పని చేస్తున్న ప్రాథమిక పాఠశాలలు 886, ప్రాథమికోన్నత పాఠశాలలు 178, ఉన్నత పాఠశాలలు 244 ఉన్నాయి. వాటిల్లో సుమారు లక్షా 30వేల మంది విద్యార్థులున్నారు. ప్రతి ఏడాది ఇప్పటి వరకు పుస్తకాలు మండల కేంద్రాలకు చేరాల్సి ఉండగా ఈ ఏడాది వాటి జాడలేదు. గతేడాది ప్రాథమిక పాఠశాలలు తెరవకుండానే మూతపడగా విద్యా సంవత్సరం చివరి అంకంలో 8, 9, 10తరగతుల విద్యార్థులకు కొద్ది రోజులు మాత్రమే పాఠశాలలు తెరిచి విద్యను బోధించారు. అయినప్పటికీ విద్యా సంవత్సరం పూర్తి కాక ముందే కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ మూతపడ్డాయి. 2021-22 విద్యాసంవత్సరంలో కూడా పాఠశాలలు తెరుచుకుంటున్నప్పటికీ ఏ మేరకు ముందుకు సాగుతాయన్న అనుమానాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రాథమిక స్థాయి విద్యార్థులు అక్షరాభ్యాసం లేనిదే ఉన్నత తరగతులకు వెళ్లడం కష్టంగా మారింది. ఈ క్రమంలో మొదటి సారిగా పాఠశాలల్లో చేరాల్సిన ఐదేండ్ల విద్యార్థులతో పాటూ, 1, 2వ తరగతుల విద్యార్థుల చదవులు ఆగమైనట్లే అన్న భయం విద్యార్థుల తల్లిదండ్రులను వెంటాడుతోంది. తల్లిదండ్రులు చదువుకున్న వారైతే ఎలాగోలా కొంత సమయం తమ పిల్లలకు చదువులు నేర్పిస్తున్నారు. చదువు రాని తల్లి దండ్రులకు చెందిన గ్రామీణ ప్రాంత విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి.
తల్లిదండ్రుల్లో థర్డ్ వేవ్ భయం..
కరోనా మహమ్మారి ఫస్ట్, సెకండ్ వేవ్ మొత్తం పెద్దలను పట్టి పీడించగా.. థర్డ్‌వేవ్‌లో చిన్నారులు ఇబ్బంది పడతారని వైద్యులు అంటున్నారు. దాంతో విద్యార్థులు భయపడుతున్నారు. పాఠశాలలు ప్రారంభమైనా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను మునుపటి మాదిరిగా పాఠశాలలు పంపిస్తా? లేదా? అన్నది కొద్దిరోజుల్లో తేలిపోనుంది. ఇప్పటికే పాఠశాలలు మూతపడి ఏడాది దాటింది.
చదువులు అటకెక్కుతున్నాయి..
పాఠశాలలు మూసి ఉంచడంతో పిల్లల చదువు లు అటకెక్కుతున్నాయి. ముఖ్యంగా 1,2,3 తరగతులు చదువుకునే పిల్లలు చదువును పూర్తిగా మరిచి పోతు న్నారు. గతేడాది ప్రారంభంలోనే పిల్లలు చదువులు మరిచిపోయారు. గతేడాది బడులు ప్రారంభమవు తాయని భావించినప్పటికీ కరోనా కేసుల ఉధతి నేపథ్యంలో సెలవులను పొడగించారు. దీంతో పిల్లలు ఇండ్లల్లోనే ఆటలతో కాలక్షేపం చేశారు. ఈ సారి కూడా ప్రభుత్వం పాఠశాలల ప్రారంభం నుంచే కరోనా పట్ల తగు జాగ్రత్త చర్యలుతీసుకోవాలి. క్రమం తప్పకుండా విద్యార్థుల టెంపరేచర్‌ను పరిశీలించాలి. పాఠశాలల్లో వేడినీళ్లను అందించాలి.
- మూల క్రిష్ణ, విద్యార్థి తండ్రి
ప్రభుత్వాలు విఫలం..
కరోనా వైరస్‌ను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమ య్యాయి. ఫలితంగా విద్యావ్యవస్థపై తీవ్రప్రభావం చూపుతోంది. బడులు మూత పడడంతో విద్యావ్యవస్థ పూర్తిగా కుంటుప డింది. చదువులు మరిచిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వచ్చేనెల ఒకటి నుంచి పాఠశాలలు ప్రారం భించాలని నిర్ణయం తీసుకుంది. ఈ తరుణంలోనే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. లేకుంటే ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది.
- జగన్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు