Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలోని మున్సిపాలిటీల్లో చెట్లనరికివేత
- నాటినప్పుడు గుర్తుకురాని విద్యుత్తు తీగలు
- ఫీజులు కొట్టేస్తున్నాయని నరికివేతలు
- విద్యుత్తు తీగల కింద పెరగని హరితహారం మొక్కలు
జిల్లాలోని ఆరో విడతల్లో నాటిని మొక్కలు నరికివేతకు గురవుతున్నాయి. ఎవరో కాదు. ఇటు మున్సిపల్ అధికారులు, అటు విద్యుత్తుశాఖ అధికారులు. ఏపుగా పెరిగి నీడనిచ్చే చెట్ల తలలను నరుకుతున్నారు. మున్పిపాలిటీలు, రహదారుల వెంట పెంచిన చెట్లను ఒక్కసారిగా గొడ్డలి వేట్లకు గురవుతున్నాయి. నాటింది.. నరుకుటకే అన్నట్టుగా హరితహారం పరిస్థితి మారుతోంది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు విడతల్లో లక్షలాది మొక్కలను నాటింది. వాటిలో అత్యధికంగా సంరక్షించగలిగింది. ఆ చెట్లు నేడు ఏపుగా పెరిగి నీడనిస్తున్నాయి. ఆ చెట్లే నేడు వారి పాలిట శాపంగా మారుతోంది. కొన్ని మొక్కలు ఎండిపోగా, మరికొన్ని నరికివేతకు గురవుతున్నాయి. హరితహారం లక్ష్యంపై ఉన్న శ్రద్ధతో ఎక్కడ నాటుతున్నామో చూసుకోకుండా ఉండటంతో అవి ప్రస్తుతం కొట్టివేతకు గురవుతున్నాయి. ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులు మొక్కలు నాటే పనిలో ఉండగా... తీగలకు అడ్డుగా ఉండటంతో విద్యుత్తు అధికారులు వాటిని కొట్టివేసే పనిలో ఉంటున్నారు.
పైన ఫొటోలు కన్పిస్తున్న కొట్టివేతకు గురైన చెట్టు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోనిది. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నాటిన మొక్క నేడు నరికివేతకు గురైంది. అధికారులు అవగాహన లోపంతో... ఇష్టానుసారంగా నాటడంతో విద్యుత్తు తీగల కింద నాటడంతో ఇలా నరికివేతకు గురైంది. ఇది ఈ ఒక్క చెట్టు పరిస్థితే కాదు జిల్లా వ్యాప్తంగా హరితహారం మొక్కలు నాటడమే లక్ష్యంగా ఉన్న అధికారుల నిర్లక్ష్యానికి గురైన చెట్ల పరిస్థితి. జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో మొక్కలు చాలా వరకు విద్యుత్తు తీగల కింద నాటడంతో అవి ఎంత ఎత్తు పెరిగినా నరికి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. రూ.కోట్లు ఖర్చు చేసి చేపట్టిన పథకానికి ఇలా విద్యుత్తు తీగల రూపంలో నరికివేతకు గురవుతున్నాయి.
అవగాహన లోపంతో..
అధికారుల అవగాహన లోపంతో తీగల కింద నాటినా, ఏదైనా ఇంటికి అతి సమీపంలో నాటినా అవి పెరిగేలోగా నరకాల్సిన పరిస్థితి. ఒక మొక్క పెరగడానికి సాధారణంగా 150నుంచి 200 రోజులు పడుతుంది. ఇన్ని రోజులు దానిని కంటికి రెప్పలా కాపాడాలి. చెట్టుగా మారేంత వరకు దానికి సుమారు రూ.200 వరకు ఖర్చు అవుతుంది. మరి ఇంత ఖర్చు చేసి ఇలా నిర్లక్ష్యంగా నాటితే చివరికి మళ్లీ నరకాల్సిన దుస్థితి.
ముందే మేల్కొంటే మంచిది
వర్షాకాలం వచ్చిందంటే చాలు నిత్యం ఎక్కడో ఒక చోట చెట్టు కూలి తీగలపై పడుతుంది. దీంతో మళ్లీ కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. వర్షాకాలంలో రోజూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక వేళ విద్యుత్తు సరఫరా అయ్యే సమయంలో చెట్టు కూలితే పెనుప్రమాదం సంభవించడమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరగొచ్చు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందే అప్రమత్తంగా నాటితే మంచిది.