Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీవో వెంకట్రామ్
నవతెలంగాణ-మర్పల్లి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని మండలంలో ఉద్యమంలా చేపడుదామని ఎంపీడీవో వెంకట్రామ్ అన్నారు. మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీల్లో అధికారులు నిర్దేశించిన మొక్కలను పెంచామని, రైతులకు అవసరం ఉన్న మొక్కలను పంచాయతీ కార్యదర్శుల ద్వారా పొందే ఏర్పాట్లు చేశామన్నారు. మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకుల సహకారాలతో కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. మండలంలో 27 కంపోస్టు షెడ్ల పరిసరాల్లో, 27 శ్మశాన వాటికల్లో, ఐదు రైతు వేదికల వద్ద, గ్రామాల రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటుతున్నట్టు వివరించారు. ఉపాధిహామీ సిబ్బంది ఎప్పటికప్పుడు కూలీలతో గుంతలు తవ్వించే పనులను ముమ్మరం చేయాలని సూచించారు. కూలీలకు గుంతకు రూ.26, మొక్కలు నాటేందుకు రూ.16 చెల్లిస్తున్నట్టు తెలిపారు. మండలంలో 15 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం నిర్దేశించిన మొక్కలను నాటేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు సహకరించాలని అన్నారు.