Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయు జిల్లా నాయకులు బుగ్గరాములు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకావాలని సీఐటీయూ మండల కన్వీనర్ బుగ్గరాములు అన్నారు. దళిత సాధికారిత కోసం కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బి.వెంకట్, జాన్వెస్లీ చేసిన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలకు, పట్టణాల్లో పారిశుధ్య కార్మికులు 99శాతం దళితులు ఉన్నారని, వారికి కనీస జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనుక వారికి వేతనాలు పెంచి పీఆర్సీ అమలు చేయాలని ముఖ్యమంత్రిని కోరగా వెంటనే స్పందించి వేతనాలు పెంచడంతో పాటు పీఆర్సీని వర్తింపచేస్తామని సీఎం హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచి పీఆర్సీ అమలు చేయాలన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో పారిశుధ్య కార్మికులతోనే విజయవంతం అయ్యిందని గుర్తు చేశారు. కానీ సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజాప్రతినిధులు ఫోటోలకు ఫోజులు తప్ప వారి వేతనాల గురించి పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పై అధికారుల దృష్టికి తీసుకుపోయిన పాపాన పోలేదని విమర్శించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో గ్రామపంచాయతీ కార్మికుల దీక్షలు, జులై 5వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి వాయిదా వేశామని చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్షులు దేవదాస్, కార్మికులు ఐలయ్య, పోచయ్య, మల్లేష్, కిషన్, బిక్షపతి, లక్ష్మమ్మ, గాలమ్మ, మంజుల, యాదమ్మ, జంగమ్మ, సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.