Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వసేవ సంఫ్ సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ ఆరోపణ
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత వల్లే వేల కోట్ల రూపాయల విలువగల భూదాన భూములు కబ్జా అవుతున్నాయని, ఇందుకు నిదర్శనం శేరిలింగంపల్లి, తారానగర్‌లోని భూదాన భూముల ఆక్రమణనే అని తెలంగాణ రాష్ట్ర సర్వసేవ సంఫ్‌ు సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఆర్ శంకర్ నాయక్ ఆరోపించారు. సోమవారం ఆర్ శంకర్‌నాయక్‌తోపాటు శేరిలింగంపల్లి నియోజకవర్గం సీపీఐ కార్యదర్శి కనకమామిడి శ్రీశైలంగౌడ్, సంఫ్‌ు నాయకులు షేక్ మహమూద్, దస్రునాయక్, శివ, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి, చందానగర్ తారానగర్ సరిహద్దు సర్వే నెంబర్ 46 లోని ఆక్రమణకు గురైన భూదాన భూములను పరిశీలించారు. శంకర్‌నాయక్ మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం భూమిలేని నిరుపేదలకు భూదానం చేయాలని ఆచార్య వినోబాభావే పిలుపు మేరకు తెలంగాణాలో చాలామంది భూస్వాములు భూ దానం చేసారని తెలిపారు. అందులో భాగంగానే కంఠాల వెంకటమ్మ అనే మహిళ తనకు వారసత్వంగా వచ్చిన 2.01 ఎకరాల భూమిని దానపత్రం ద్వారా భూదాన్ యజ్ఞ బోర్డుకు అప్పగించారని తెలిపారు. ఆ భూములను నిరుపేదలకు పంచకుండా గత ప్రభుత్వాలు, నేటి ప్రభుత్వం ఫుర్తిగా నిర్లక్ష్యం చేయడంతో నేడు ఆ భూములు భూబకాసురులకు వరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రెవెన్యూ రికార్డులు, భూదాన్ బోర్డు గణాంకాలకు భారీ వ్యత్యాసం ఉందని తెలిపారు. అన్యాక్రాంతమైన భూదాన భూములపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, భూదాన యజ్ఞ బోర్డు ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కనకమామిడి శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి అండతోనే భూదాన భూములను కబ్జా చేశారని ఆరోపించారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో సీపీఐ పక్షాన పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.