Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, బస్తీ దవాఖానల్లో ఏర్పాట్లు
- మలేరియా, డెంగ్యూ, డయేరియా పరీక్షలకు సన్నద్ధం
- రాపిడ్ రెస్పన్స్ టీమ్‌ల ఏర్పాటు
కరోనా, సీజనల్ వ్యాధుల లక్షణాలు ఒకేలా ఉండటంతో గ్రామీణ ప్రాంతాల ప్రజల్లో భయాందోళన మొదలైంది. వర్షాకాలంలో జలుబు, జ్వరం రావడం సహజం కానీ కరోనా వ్యాధి లక్షణాలు కూడా ఇలానే ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం కరోనా నిర్ధారణ పరీక్షలు, టీకాలు వేసే ప్రక్రియలో నిమగమైన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సీజనల్ వ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు అవసరమైన చికిత్స అందించడం, వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించింది.
నవతెలంగాణ-రంగారెడ్డిప్రాంతీయప్రతినిధి
రంగారెడ్డి జిల్లా పరిధిలో 37 బస్తీ దవాఖానాలు, 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు , 15 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1 ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి ఉంది. అన్ని ఆస్పత్రుల్లో సీజనల్‌కు సంబంధించి అన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా వైద్యధికారులు తెలుపుతున్నారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టినా వైరస్ పూర్తిగా ప్రజల నుంచి వీడిపోలేదు. మహమ్మారికి తోడు సీజనల్ వ్యాధులు తోడవనుండటంతో కోవిడ్ వైరస్, ఇటు సీజనల్ వ్యాధులు ఓవర్‌ల్యాప్స్ అయ్యే అవకాశలు లేకపోలేదు. సాధారణంగా వర్షాకాలంలో దోమల కారణంగా డెంగ్యూ జ్వరాలు అధికంగా వస్తాయి. రోగులకు వచ్చిన జ్వరం కరోనాదా లేదా సీజనల్తో వచ్చిందా తెలుసుకోవడం అంత సులువు కాదంటున్నారు వైద్యులు. జ్వరమొచ్చిన ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని, అదే సమయంలో కేసును తేలికగా తీసుకోలేమంటున్నారు. దీనిని దష్టిలో ఉంచుకొని గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సీజనల్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. దోమల వద్ధి చెందకుండా, ఫాగింగ్, యాంటీ లార్వా, డ్రైడే వంటి చర్యలు చేపట్టింది. సాధారణంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్‌తోపాటు డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటివి ప్రబలడం సహజం వీటి భారిన ప్రజలు పడకుండా వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుటుంది.
బస్తీ స్థాయిలోనే అరికట్టేందుకు ప్రణాళిక
సీజనల్, కరోనా లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. మూడు రోజుల్లో జ్వరం, జలుబు, దగ్గు వంటివి తగ్గకుంటే కరోనా సీజనల్ వ్యాధులకు సంబంధించి మలేరియా, డెంగీ, టైఫాయిడ్, డయేరియా నిర్ధారణ పరీక్షలను బస్తీ దవాఖానలు, పీహెచ్సీ, యూపీహెచ్‌సీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. సీజనల్ వ్యాధులను దాదాపు బస్తీ దవాఖానల స్థాయిలోనే నివారించేలా చర్యలు తీసుకున్నాం.
కరోనా నిర్ధారణ పరీక్షలు, టీకాతోపాటు రోగులకు కరోనా కిట్లు పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు కరోనాతోపాటు సీజనల్ వ్యాధులు ప్రబలితే విధి నిర్వహణ కత్తిమీద సామువంటిదే. కరోనా తొలిదశలో సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. ఇప్పుడు కూడా మెరుగైన సేవలు అందిస్తాం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు, ఐవీ ఫ్ల్యూయిడ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం. అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. కరోనా సమయం కావడంతో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
- రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి