Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఎస్యూఐ ఆందోళనలతో..దద్దరిల్లిన ఇంజనీరింగ్ కళాశాలలు
- ఇబ్రహీంపట్నంలో లాఠీ ఛార్జీ
- విద్యార్థులను పరుగులు పెట్టించిన పోలీసులు
- ఇంజనీరింగ్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లాలోని ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళనలు, పోలీసుల లాఠీ ఛార్జీలతో రణరంగంగా మారింది. విద్యార్థుల నినాదాలతో కళాశాల పరిసరాలు మారుమోగాయి. దాంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఒక్కసారిగా దూసుకు వస్తున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు. ఇంజనీరింగ్ మొదటి సెమిస్టర్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగానే వందలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఇబ్రహీంపట్నం సమీపంలోని శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాల ఎదుటు ఆందోళనకు దిగారు. మంగల్‌పల్లి గేటు నుంచి ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో విద్యార్థులు శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాల వైపు ర్యాలీలు చేశారు. ఈ తరుణంలో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో విద్యార్థులు రోడ్డుపైనే బైటాయించి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు తాళ్లతో రోడ్డుపక్కకు జరిపే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులను తోపుకుని ముందుకు వచ్చే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఎన్ఎస్యూఐ నాయకులను అదుపులోకి తీసుకుని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. నాయకులను అరెస్టు చేయడంతో రోడ్డుపైనే గుమ్మికూడిన కార్యకర్తల లాఠీ ఝలిపిస్తూ తరమారు. దాంతో విద్యార్థులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. సుమారు గంటన్నర సేపు ఆ ప్రాంతం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని కోరేందుకు వెళ్తున్న తమపై పోలీసులు లాఠీ ఛార్జీ చేయడం దారుణమన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఓ వైపు ఇతర విద్యాసంస్థల తరగతులు ఆన్లైన్లో నిర్వహిస్తూ, ఇంజనీరింగ్ సెమిస్టర్లను మాత్రం ప్రత్యక్షంగా నిర్వహించడం ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని ఆదిభట్ల, మీర్‌పేట, ఘట్కేసర్, మేడిపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. ఈ ఆందోళనలకు ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షులు వినరుపటేల్ నాయకత్వం వహించారు. అంతని ఇబ్రహీంపట్నంలోని శ్రీఇందు కళాశాల వద్ద నిర్వహించిన ఆందోళన సందర్భంగా పోలీసులు అరెస్టు చేశారు.