Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణ కేంద్రంలో ఉన్న జిల్లా ఆస్పత్రిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీత మహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణ కేంద్రంలోని జిల్లా ఆస్పత్రిలో జడ్పీ చైర్పర్సన్ సునీతమహేందర్‌రెడ్డి అధ్యక్షతన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లా ఆస్పత్రి అభివృద్ధికి ఇప్పటి వరకు 70 లక్షల జడ్పీ నిధులు మంజూరు చేయడం జరిగిందని, మరికొన్ని పనులకు నిధులు మంజూరు చేస్తామన్నారు. జిల్లా ఆస్పత్రికి మంచి పేరుందని ఆస్పత్రికి జిల్లా ప్రజలే కాకుండా మహబూబ్‌నగర్, కర్ణాటక ప్రజలు కూడా వైద్య సేవలకు వస్తుంటారని సూచించారు. ఈ ఆసుపత్రికి ప్రసవాలలో రాష్ట్రంలో 3వ స్థానం ఉందన్నారు. ఆస్పత్రిలో ఉన్న 36 మంది సిబ్బంది మూడు షిఫ్ లలో డే అండ్ నైట్ పని చేసి గర్భిణులకు ఇబ్బంది కలుగకుండ వైద్య సేవలు అందించాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధికి ఇప్పటి వరకు 70 లక్షల జడ్పీ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. మునుముందు కూడా ఆస్పత్రి అభివృద్ధి, సుందరికరనకు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో రూ. 1.10 కోట్ల విలువ గల సిటీ స్కాన్ యంత్రాన్ని రూ. 6.00 లక్షలకు పత్రిక ప్రకటన ద్వారా వేలం వేయడంపై సభ్యులు అభ్యంతరం వ్యక్తపరిచారు. అధ్యక్షుల అనుమతి లేకుండా ఇలా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. మునుముందు ఇలాంటి పొరపాట్లు జరుగకుండ జాగ్రత్తలు వహించాలని సభ్యులు సూచించారు. ఏజెన్సీ ద్వారా ఔట్ సోర్సింగ్ నియామకాలలో అవకతవకలు జరుగుతున్నాయని సభ్యులు అభ్యంతరం తెలిపారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మరియు కమిటీ కో -చైర్మన్ పౌసుమీ బసు మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రికి ఒక అంబులెన్సు (డ్రైవర్‌తో సహా ) మరియు 20 నర్సులతో పాటు మొత్తం 43 పోస్టులు త్వరలో భర్తీ కానున్నాయని తెలిపారు. రూ. 2.00 కోట్ల విలువ గల సిటీ స్కాన్ యంత్రం కూడా మంజూరు అయ్యిందని త్వరలో ఆసుపత్రికి వస్తుందని తెలిపారు. రాబోవు ఐదు రోజులలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని అన్ని ఏర్పాట్లతో ప్రారంభించనున్నట్టు తెలిపారు. చైర్మన్ అనుమతి లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దని డాక్టర్ మల్లికార్జునకు ఆదేశించారు. ప్రతి మూడు నెలలకు ఒక సారి హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించాలని, ఆసుపత్రికి మంజూరు అయిన నిధులు, ఖర్చులు, నిలువ వివరాలు తెలిపే రిజిస్ట్రార్లు తో పాటు తప్పకుండ అడిట్ చేయించాలని డాక్టర్. మల్లికార్జున్‌ను ఆదేశించారు. బయో మెడికల్ వేస్టెజ్ని డంపింగ్ యార్డ్‌లలో పడేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ అక్షేపించిగా, కలెక్టర్ స్పందిస్తూ తగు జాగ్రత్తలు వహించాలని ఆదేశించారు. డాక్టర్లు అందరు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేసి ప్రజలకు రాత్రి పగలు మంచి సేవలు అందించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమల్, ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ మల్లికార్జున్, యాదయ్య, ప్రెసిడెంట్ శివమోహన్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, ఇతర సభ్యులు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.