Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విశ్వనాథ్ రైస్ మిల్లు ఎదుట ధర్నా
- ఎంపీపీ, సర్పంచ్‌తో పాటు ఉప్పరిగుడ, పోచారం గ్రామస్తుల ఆందోళన
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం రైస్‌మిల్ యజమానుల అలసత్వం కారణంగా ప్రమాదానికి గురైన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ శాఖ హెల్పర్ అబ్జల్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పోచారం, ఉప్పరిగూడా సమీపంలోని విశ్వనాధ్ రైస్ మిల్లు ఎదుట కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు . వీరి ఆందోళనకు ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, ఉప్పరిగూడ సర్పంచ్ రామ్ రెడ్డి మద్దతు పలికారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఆందోళనతో రైస్ మిల్లు సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైస్ మిల్లు యజమానులుతో నాయకులతో చర్చలు జరిపారు. ఇబ్రహీంపట్నం మండలం పోచారం గ్రామ సమీపంలోని విశ్వనాధ రైస్‌మిల్‌లో గత మూడు రోజుల క్రితం విద్యుత్ అంతరాయం ఏర్పడింది. అయితే రైస్‌మిల్ యాజమాన్యం స్థానిక లైన్మెన్కు సమాచారం ఇచ్చారు. సదరు ప్రాంతంలో హెల్పర్‌గా పని చేస్తున్న అబ్జల్కు విషయం చెప్పారు. పై అధికారి ఆదేశాల మేరకు రైస్ మిల్లులో ఏర్పడిన విద్యుత్ అంతరాయాన్ని నివారించి, విద్యుత్తును పునరుద్ధరించేందుకు అక్కడికి వెళ్లారు. ట్రాన్స్ ఫార్మర్ పైకి ఎక్కి విద్యుత్తును పునరుద్ధరించే క్రమంలో షాక్ గురై విద్యుత్ తీగలకు వేలాడుతూ కనిపించాడు. దాంతో రైస్ మిల్లులో పని చేస్తున్న కూలీలు ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్తు నిలిపివేశారు. అనంతరం తీగలపై వేలాడుతున్నా అబ్జల్‌ను కిందకు దింపారు. అతని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే గత మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబం కడు పేదరికంలో ఉండడంతో కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. పైగా అతని చేతిని తొలగించారు. రైస్ మిల్లు యజమానుల ఫిర్యాదు మేరకు విద్యుత్తును సర్వీస్ పునరుద్ధరించే క్రమంలో తమ కుటుంబ యజమాని ప్రమాదంలో చిక్కుకున్నాడని, రైసు మిల్లు యజమానులు తమను పట్టించుకోవడం లేదని, వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది కలుగుతోందని కుటుంబ సభ్యులను ఆందోళనకు గురయ్యారు. కాగా అబ్జల్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపెష్, సర్పంచ్ రామ్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బోసుపల్లి వీరేష్ కుమార్, బిజెపి నాయకులు అర్జున్ రెడ్డి, మాజీ సర్పచ్ శ్రీశైలం, పలువురు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామాల సమీపంలో కలుషిత వాతావరణాన్ని సృష్టిస్తున్న రైస్‌మిల్లు యజమానులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.