Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సంజయ్ యాదవ్
- సబితా ఇంద్రారెడ్డికి వినతి
నవతెలంగాణ- శంషాబాద్
మున్సిపాలిటీ కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ కాంగ్రెస్ శంషాబాద్ మున్సిపల్ అధ్యక్షుడు, కౌన్సిలర్ పీ సంజయ్ యాదవ్ సోమవారం తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితారెడ్డికి వినతిపత్రం అందజేశారు. శంషాబాద్లో రూ.కోటితో గ్రంథాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకు వినతిపత్రం అందజేశారు. శంషాబాద్లో నెలకొన్న విద్యా సంబంధమైన పరిస్థితులను వివరించారు. ఆయన మాట్లాడుతూ శంషాబాద్ మాజీ జడ్పీటీసీ, మాజీ సర్పంచ్ సత్యనారాయణ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు శంషాబాద్లో ఇంటర్మీడియట్ కళాశాల ఏర్పాటు చేశారని తెలిపారు. ఇంటర్ కళాశాల ఏర్పడి 39 ఏండ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం బాధాకరమన్నారు. శంషాబాద్లో సుమారు లక్ష మంది విద్యార్థులుండగా ఒక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో పేదలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ అరకొర సౌకర్యాలే ఉన్నాయని వివరించారు. జిల్లా పరిషత్ ( బాల, బాలికల) ఉన్నత పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయన్నారు. ఈ సమస్యలన్నింటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు. కనీస సౌకర్యాలు లేవని బస్ స్టేషన్, అంతర్గత రోడ్లు, ప్రధాన రోడ్లు, అధ్వాన్నంగా ఉన్న డ్రయినేజీ వ్యవస్థను సరిచేయాలని విన్నవించారు. లేనిపక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.