Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- రూ.కోటితో శంషాబాద్‌లో గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-శంషాబాద్
రంగారెడ్డి జిల్లాలో పది కోట్ల రూపాయలతో గ్రంథాలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం శంషాబాద్ బార్సు హై స్కూల్ గ్రౌండ్లో రూ.కోటి వ్యయంతో నిర్మించనున్న డిజిటల్ గ్రంథాలయ భవనానికి రాజేంద్రనగర్ శాసనసభ్యుడు టి ప్రకాష్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ సురభి వాణి దేవితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాల అభివద్ధికి రూ.4 వేల కోట్ల బడ్జెట్ మంజూరు చేశారని తెలిపారు. త్వరలో పాఠశాలలలో మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణాలు, అసంపూర్తి పనులను పూర్తి చేస్తామని చెప్పారు. త్వరలో ఉన్నత పాఠశాలలో గ్రంథాలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. శంషాబాద్, షాద్‌నగర్, కల్వకుర్తి, చేవెళ్ల మండల కేంద్రాల్లో గ్రంథాలయాల నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. గతంలో శంషాబాద్‌లో లైబ్రరీ ఏర్పాటు చేయాలని పక్కా భవనం నిర్మించాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఆచరణలో సాధ్యం కాలేదని అన్నారు. ప్రస్తుతం నిర్మించ తలపెట్టిన గ్రంథాలయ భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని హామీనిచ్చారు.
ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి..
ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలు గతంలో రెగ్యులర్ పాఠశాలల మాదిరిగా ఫీజులను వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సబితారెడ్డి హెచ్చరించారు. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేసుకోవాలని సూచించారు. దానికి సంబంధించిన జీవో గతంలోనే విడుదల చేశామని, అదే జీవోను మళ్లీ అమలు చేస్తున్నామని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తే రంగారెడ్డి జిల్లా డీఈవో వెంటనే స్పందించి ఆ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్, మున్సిపల్ చైర్పర్సన్ సుష్మా మహేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ బండి గోపాల్‌యాదవ్, నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు ఆర్ రేఖాగణేష్ గుప్తా, ఈ అజరు జహంగీర్‌ఖాన్, వై కుమార్, శ్రీకాంత్ యాదవ్, పీ సంజరు యాదవ్, మేకల వెంకటేష్, కొనమొల్ల భారతమ్మ, విజయలక్ష్మి, పుష్పలత బుచ్చిరెడ్డి, చెన్నం అశోక్, లావణ్య శ్రీనివాస్, రాణియాదయ్య, లక్ష్మీ శ్రీనివాస్, అమతరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు సంతోష ప్రభాకర్, కవితా ప్రసాద్, మండల విద్యాధికారి రామ్‌రెడ్డి, తహసీల్దార్ జనార్దనరావు, ఎంపీడీవో వినరు కుమార్, తదితరులు పాల్గొన్నారు.