Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నోరు మెదపని కేంద్రాల నిర్వాహకులు
తూకం వేసి మిల్లుకు తరలించాక కొర్రీలు
నష్టం రైతు నెత్తిన వేస్తున్న నిర్వాహకులు
రెండు నెలలు దాటిన అందని
ధాన్యం డబ్బులు
క్వింటాలుకు 10 కిలోల చొప్పున దోచారని రైతుల ఆవేదన
అమ్మబోతే అడవి.. కొనబోతే కొరవి అన్న చందంగా అన్నదాతల పరిస్థితి ఉంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటను అమ్ముకుంటే మిల్లర్లు వరి ధాన్యం రైతును నిలువునా దోచుకున్నారు. రైతుల నుంచి ఐకేపీలు సేకరించిన ధాన్యాన్ని లారీలో పంపిస్తే దాంట్లో అడ్డగోలుగా కోతలు విధించారు. 500 బస్తాలతో లారీ లోడ్ పంపితే 150 నుంచి 200 దాకా కోతలు విధించారు. ధాన్యం నాణ్యతలో తేడాలు ఉన్నాయని భావిస్తే ఐకేపీలు, రైతులు కూర్చొని చర్చించుకుని కోతపై ఒక ఒప్పందానికి రావాలి. అలాంటివేవీ లేకుండా ఏకపక్షంగా కోతలు విధించారు.
నవతెలంగాణ-కొడంగల్
రైతులు కొనుగోలు కేంద్రంలో వేసిన ధాన్యానికి, ఐకెపి సెంటర్లో రైతులకు ఇచ్చిన రసీదుకు, వారికి వచ్చిన బిల్లుల చెల్లింపులో తీవ్ర వ్యత్యాసం ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక లారీలో 700 బ్యాగులు పంపిస్తే రెండు వందల నుంచి 300 బ్యా గుల దాకా కోత విధించారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు, ఐకేపీలు అప్పగించారు. అడ్డగోలు కోతలతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఐకేపీ సిబ్బంది రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను నమోదు చేసి రవాణా సిబ్బందికి అప్పగిం చారు. ధాన్యం లారీలు మిల్లర్లకు చేరగానే అక్నాలెడ్జ్మెం ట్ మీద మిల్లర్ల తో ధాన్యం వివరాలు రాయించుకుని, సంతకం తీసుకొని పౌరసరఫరాల అధికారులు సీల్ వేయిస్తారు. ఇక్కడే భారీ అక్రమాలకు పాల్పడ్డారు. ధాన్యం అన్లోడ్ కాగానే కొత్త పేరుతో ఒక్కో లారీకి 200 ఈరోజు నుంచి మూడు వందల కిలోల వరకు ఇష్టారీతిన తగ్గించారు. నిజానికి తేమ ఉంటే రైతుల అంగీకారంతో మాత్రమే తరుగు తీయాలి, తరుగు పేరుతో రైస్ మిల్లర్లు క్వింటాలుకు 10 కిలోల చొప్పున కోత విధించి కొత్త మోసానికి తెరతీశారు.
కొనుగోలు నిర్వాహకులు వరి ధాన్యం మిల్లర్లకు పంపిన తర్వాత మిల్లర్లు ఇచ్చిన రసీదుతో వెంటనే పౌరసరఫరాల శాఖ అధికారులకు రసీదు పంపించి డబ్బులు పడే విధంగా చూడాలి కానీ ఇప్పటివరకు వరి ధాన్యం కొనుగోలు నిర్వహకులు రసీదులు ఇంట్లోనే పెట్టుకొని ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. ఒక బస్తాకు 41 కిలోల 500 గ్రాములు తూకం ఉండాలి, కానీ ధాన్యం తూకం సమయంలోనే అనేక కారణాలను చూపుతూ బస్తాకు మూడు, నాలుగు కిలోల తరుగు తీశారు. జిల్లాలో సరిపడా రైస్ మిల్లు లేక ఇక్కడ పండిన ధాన్యాన్ని ఆమనగల్, కరీంనగర్ మిల్లర్లకు తరుగు తీసి పంపించిన ఇప్పుడు కొత్తగా క్వింటాలుకు 6 నుంచి 10 కిలోలు తీసేయడంతో రైతులు పండించిన పంటకు లాభం లేకుండా పోతుందని లబోదిబోమంటున్నారు. రైతులు వెళ్లి కేంద్రాల నిర్వాహకులకు అడగగా రాక రకాలుగా సమాధానాలు చెప్పడంతో రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధు లు స్పందించి వరి ధాన్యంలో కోత విధించకుండా డబ్బులు వెంటనే ఖాతాలో పడే విధంగా చూడాలని రైతులు కోరుతున్నారు.
ఆధారాలు దొరకకుండా జాగ్రత్త
తరుగును పరిగణలోకి తీసుకొని బస్తాకి 42 కిలో ల చొప్పున లెక్కించినా ధాన్యం సంచులు నింపారు. ధాన్యం ఎంత బరువు ఉందో లెక్కగట్టి రైతుల పేర్లతో సహా వివరాలను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ట్రాక్ సీటులో నమోదు చేశారు. వాస్తవంగా సంచి బరువుకు తగినంత ధాన్యం అదనంగా తూకం వేయడంతో మిల్లుకు చేరినప్పుడు లారీలో ధాన్యం సీట్లో చూపిన బరువు కంటే ఎక్కువ ఉంది. అయినా మిల్లర్లు తేమశాతం ఎక్కువగా ఉందంటూ ఒక్కో లారీకి 800 క్వింటాళ్ల వరకు తగ్గించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కొనుగోలు నిర్వాహకులు పంపిన ట్రక్ సీటును మార్చి పంపడంతో రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతుంది.