Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు
- రాష్ట్ర నిర్లక్ష్యంతోనే ఏపీ జలదోపిడీ : అనంతరెడ్డి
నవతెలంగాణ-షాద్నగర్ రూరల్
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతలలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనే లక్ష్యంగా, ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం పార్టీ జెండాలను పక్కన బెట్టి పోరాటాలు చేద్దామని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలో జలసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు అనంతరెడ్డి ఆధ్వర్యంలో కష్ణా జలాల పూర్తి వినియోగం, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనకై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జడ్చర్ల, మహబూబ్ నగర్, కొడంగల్ నియోజకవర్గాల నాయకులు, లెక్చరర్లు ఫోరం, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం, జర్నలిస్టుల ఫోరం, సామాజిక వేత్తలతోపాటు షాద్ నగర్ కాంగ్రెస్ నేతలు వీర్లపల్లి శంకర్, బాబర్ ఖాన్, బాలరాజ్ గౌడ్, పురుషోత్తం రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి, సీనియర్ నేతలు అందే బాబయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివద్ధి, సాగునీటి ప్రాజెక్టుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఉత్తర తెలంగాణలో దాదాపు 13 ప్రాజెక్టులు ఉన్నాయని కానీ దక్షిణ తెలంగాణ నదీపరివాహక ప్రాంతంలోని నీటి ప్రాజెక్టుల పనులు ముందుకు సాగకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న సీఎం కేసీఆర్ మాటతప్పాడన్నారు. మరోవైపు ఏపీ కష్ణా జలాలను అక్రమంగా దోచుకుంటున్నా రాష్ట్ర వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం బాధాకరమన్నారు. సీఎం నిర్లక్ష్యం వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లి, చైతన్యం చేసి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనకు మరో సకల జనుల సమ్మెను చేపడతామని తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తర దక్షిణ తెలంగాణలపై వివక్ష వీడి కష్ణా పరివాహక ప్రాంత ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని, రాయలసీమ, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని కోరారు. ఏపీ తెచ్చిన 203 జీవో అమలు రాష్ట్రాన్ని ఎడారిగా మారుస్తుందని సూచించారు. ఇప్పటికైనా కష్ణా జలాలను పూర్తిగా వినియోగించేందుకు కషి చేయాలని కోరారు. లేదంటే జలసాధన సమితి ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
రిజర్వాయర్ సాధనకు ఉద్యమిద్దాం : సీనియర్ జర్నలిస్ట్ మోహన్ రెడ్డి
పార్టీల నాయకులపై విమర్శలు చేయకుండా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ సాధనే లక్ష్యంగా ఉద్యమిద్దామని షాద్నగర్ సీనియర్ జర్నలిస్ట్ మోహన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పలుమార్లు అసెంబ్లీలో నియోజకవర్గ ప్రజల నీటి కష్టాలను ప్రస్తావించినా పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పూరైయితేనే సాగు, తాగు నీటి సమస్య తీరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మురళీ మనోహర్, జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు ప్రసాద్, రిటైర్డ్ ఇంజినీర్ ఫోరం నేత వెంకట రమణ, సామాజిక వేత్తలు సుబ్బారెడ్డి, గంగిరెడ్డి, దిడ్డి గోపాల్, వివిధ పార్టీల నాయకులు రిషికేశ్, చెట్ల వెంకటేష్, సంతోష్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.