Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏండ్లుగా ఎదురుచూస్తున్న లబ్దిదారులు
- ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న దరఖాస్తు దారులు
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న 65 వయసు వృద్ధులు సుమారు 17,998 మంది పింఛన్ కోసం రెండున్నరేండ్లుగా ఎదురు చుస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో 5868 మంది, రంగారెడ్డిలో 12,130 మంది దరఖాస్తులు పెండింగులో ఉన్నట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఇక 57 ఏండ్ల వయసు వారు సుమారు 1 లక్ష 20వేల మంది ఆసరా పింఛన్‌కు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 45,318 మందిని అర్హులుగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో 31,947 మంది, వికారాబాద్ జిల్లాలో 13,371 మంది వద్ధులు ఆసరా పింఛన్‌కు అర్హులుగా అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2,60,758 మంది ఆసరా లబ్ధిదారులు ఉండగా, వికారాబాద్ జిల్లాలో 96,569 మంది, రంగారెడ్డిలో 1,64,189 మంది ఆసరా లబ్దిదారులు ఉన్నారు. వికారాబాద్‌లో వద్ధాప్య పింఛన్‌దారులు 30,829 మంది, వితంతువులు 47,038, వికలాంగులు 12,292, గీత కార్మికులు 435, చేనేత కార్మికులు 160, బీడీ కార్మికులు 40, హెచ్ఐవీ బాధితులు 1017, పైలేరియా రోగులు 211, ఒంటరి మహిళలు 4,547 మంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో వద్ధాప్య పింఛన్లు 53,013, వితంతువులు 76,349, వికలాంగులు 26,078, గీతా కార్మికులు 754, చేనేత కార్మికులు 2,012 , ఒంటరి మహిళలు 5,924 మంది, బీడీ కార్మికులు 16 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఆసర పింఛన్ వయో పరిమితిని 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించి వారిలో అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఎంతో ఆశగా 57 ఏండ్ల వయసు వారు దరఖాస్తు చేసుకొని రెండున్నరేండ్లు గడుస్తున్న నేటికి అమలుకు నోచుకోలేదు.
పడిగాపులు...
ఆసరా పింఛన్లకు 65 ఏండ్ల వయసు పైబడిన వారినే ఇంత వరకు అర్హులుగా పరిగణిస్తూ రాగా, గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వద్ధాప్య పింఛన్లకు ప్రస్తుతం ఉన్న వయో పరిమితి అర్హతను 57 ఏండ్లకు కుదిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. 2019 జూన్ నుంచి వర్తింపజేస్తామని చేసిన ప్రకటనకు సంబంధించిన ఉత్తర్వులు జారీ కాకపోవడంతో వద్ధులు పింఛన్లకు నోచుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే 57 ఏండ్లకు పైబడిన వారు ఎంత మంది ఉన్నారనేది అధికారులు గుర్తించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని రంగారెడ్డి జిల్లాలో 31,947 మంది ఉన్నట్టు గుర్తించారు. అలాగే వికారాబాద్ జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం అర్హులైన వద్ధులు 13,371 మంది ఉన్నట్టు అధికారులు లెక్కలు తేల్చారు. అర్హుల లెక్కలు తేల్చి ఏండ్లు గడుస్తున్న పింఛన్ ఇవ్వడంలో మాత్రం సర్కారు మీనమేసాలు లెక్కబెడుతుంది.