Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతులకు లాభం చేకూర్చని రుణమాఫీ విడతల వారీతో వడ్డీలకే సరి
- రంగారెడ్డి జిల్లా 1,47,075 మంది రైతులకే లబ్ధి
- ఇంకా మిగిలే ఉన్న అన్నదాతలు
- రుణాలు చెల్లించకపోవడంతో బ్లాక్ లిస్టులో రైతుల ఖాతాలు
- కొత్త రుణాలను పొందలేకపోతున్న అన్నదాతలు
- తాజాగా రూ.50 వేల వరకు రుణాల మాఫీకి నిర్ణయం
- ఏకమొత్తంలో చెల్లించాలంటున్న రైతులు
రాష్ట్ర ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల సందర్భంగా చేసిన రుణమాఫీ వాగ్ధానం మేరకు ఆలస్యంగా అమల్లోకి వచ్చింది. అది కూడా సగమే. కేవలం రూ.50వేల లోపు రుణం తీసుకున్న రైతులకు మాత్రం రెండో విడత రుణమాఫీ వర్తించనుంది. ఇక రంగారెడ్డి జిల్లాలో సుమారు 50వేల మంది వరకు మాత్రమే లాభం చేకూరనుంది. మరో రెండు విడతల రుణమాఫీ ఎన్నడు అవనుందోనని అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇటు ఒకే సారి పంట రుణం మాఫీ కాకపోవడం, బ్యాంకు రుణాలు లభించక అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
హుజురాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు రకాల సంక్షేమ పథకాలను శ్రీకారం చుడుతోంది. అందులో నిన్నటి వరకు దళిబంధును ప్రవేశ పెట్టిన ప్రభుత్వం తాజాగా రెండో విడత రూ.50వేలలోపు పంట రుణాలు మాఫీ చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఈ మేరకు రాష్ట్ర క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి పంట రుణాలను మాఫీ చేసేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రంలో వరుస ఎన్నికలు, కోవిడ్-19 విజృంభప నేపథ్యంలో ఈ పథకాన్ని విడతల వారీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ పథకం రైతులు ఏ విధంగా ఉపయోగపడని దుస్థితి నెలకొంది. జిల్లాలో రూ.లక్ష లోపు రుణాలున్న రైతులు 1,46,420మంది ఉండగా, సుమారు రూ.2,000 కోట్లు బడ్జెట్ కేటాయించాల్సి ఉంది. అయితే, ఒకే సారి ఇంత బడ్జెట్ వ్యవసాయ శాఖకు కేటాయింపులు చేయడం లేదు. దాంతో ప్రభుత్వం విడతల వారీగా పంట రుణాలను మాఫీ చేస్తుంది.
గత ఖరీఫ్‌లో జిల్లాలో రూ.25వేల లోపు రుణాలున్న రైతుల బకాయిల మాఫీకి అవసరమైన నిధులు కేటాయించింది. జిల్లాలో దాదాపు 10,928 మంది రైతులు మాత్రమే ఈ పరిధిలోకి వచ్చారు. సుమారు రూ.16.73 కోట్ల వరకు మాత్రమే ఈ కేటగిరీలో రుణాలు రద్దయ్యాయి. ఇంకా లక్షా40వేల మంది రైతులకు సంబంధించిన పంట రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. తాజాగా రూ.50వేల లోపు బకాయిల మాఫీకి సంబంధించి జిల్లాల్లో వ్యవసాయ శాఖ, లీడ్ బ్యాంకు అధికారుల వద్ద ఇంకా నివేదికలు అందు బాటులో లేవని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టరేట్‌కు వివరాలన్నీ పంపామని, అక్కడి నుంచే ప్రభుత్వం ఇచ్చే పరిధికి అనుగుణంగా ఖాతాలను విభజించి బ్యాంకులకు నివేదిస్తారని, ఆ ప్రకారం నిధులు ఆన్లైన్ ద్వారా జమ చేస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో జిల్లాలో రూ.50 వేల పరిధిలో ఎందరు రైతులకు, ఎంత మేర రుణమాఫీ అవకాశముందనే అంశంపై పూర్తి వివరాలొచ్చేందుకు మరో రెండు, మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.
విడతల వారీ మాఫీతో ప్రయోజనం కంటే నష్టమే అధికంగా ఉంటుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ హామీ ఇచ్చిన తర్వాత 2018-19 రబీ, 2019-20 ఖరీఫ్, రబీ, 2020-21 ఖరీఫ్, రబీ తాజాగా 2021-22 ఖరీఫ్ కలిపి మొత్తం ఆరు సీజన్లు గడిచినా రుణమాఫీ పథకం కొలిక్కి రాకపోవడంతో పంటరుణాల కోసం రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు.
మూడు సంవత్సరాలు గడస్తుండటంతో వడ్డీలు రెట్టింపవువుతున్నాయి. ప్రభుత్వం 2018లో తీసుకున్న వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారమే మాఫీ మొత్తం ఇస్తుండటంతో, ఆ మొత్తం వ్యక్తిగతంగా రైతులకు చేరేసరికి వడ్డీలకే సరిపోలేని పరిస్థితి ఉంది. దీనికి తోడు ఖాతాలను బ్లాక్ చేయడంతో రైతులు ధాన్యం అమ్మిన డబ్బును నగదుగా మార్చుకోవడానికి, బంగారు రుణాలు తీసుకోవడానికి, ఇతర రుణాలు పొందే అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుంది.