Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల మీద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని సీపీఐ(ఎం) పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు నీరటి మల్లేష్ అన్నారు. గురువారం నేతాజీనగర్‌లో సీపీఐ(ఎం) పార్టీ శాఖ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీలో పనిచేస్తున్న సభ్యులు ప్రజల పక్షాన నిలబడి పని చేయాలన్నారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని తెలిపారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని అన్నారు. కొంతమంది కార్పొరేట్ శక్తుల కోసం విద్యుత్ సవరణ బిల్లు, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చిందని తెలిపారు. రైతు, కార్మిక, కర్షక వ్యతిరేక ప్రభుత్వానికి వచ్చే రోజుల్లో సీపీఐ(ఎం) ఎదురొడ్డి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ(ఎం) పార్టీ నేతాజీనగర్ శాఖ కార్యదర్శిగా జీఎం గట్టయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కన్వీనర్ జీఎం కురుమయ్య, ఏ శ్రీనివాస్, బాలస్వామి, బీ వెంకటస్వామి, ఏ వెంకటస్వామి, సీఆర్పీ రాములు, తదితరులు పాల్గొన్నారు.