Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.32 లక్షలతో ఉడాయించిన వైనం సొత్తు స్వాధీనం,
- నిందితుడి అరెస్టు, రిమాండ్
- వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి
నవతెలంగాణ-శంషాబాద్
తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు మోసగించిన సంఘటన శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. గురువారం శంషాబాద్ జోన్ డిసిపి కార్యాలయంలో డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఏపీ రాష్ట్రంలోని కడప జిల్లాకు చెందిన అవ్వరు సుధాకర్ (33) వత్తిరీత్యా చేనేత కార్మికుడు. పదో తరగతి చదువుకున్నాడు. నాలుగేండ్ల కింద అనారోగ్యం కారణంగా చేనేత పని మానేసి ఇంటిదగ్గర ఉంటున్నాడు. డబ్బు సంపాదించాలనే ఆశతో సుధాకర్ కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన సుబ్రహ్మణ్యంను పరిచయం చేసుకొని తక్కువ ధరకే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం ఇప్పిస్తారని మూడేండ్ల కింద రూ.ఆరు లక్షలు తీసుకొని మోసం చేశాడు. అలాగే విజయవాడలో ఐదు నెలల కింద పరిచమైన నండూరి రామ్ ప్రసాద్‌ను కూడా ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు తనకు తెలుసని, తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని నమ్మించాడు. నాగార్జునరెడ్డి అలియాస్ సుధీర్ కుమార్ అనే వ్యక్తి కస్టమ్ డిపార్ట్మెంట్లో మేనేజర్‌గా పని చేస్తున్నట్లుగా పరిచయం చేశాడు. దీంతో రాంప్రసాద్ కిలో బంగారం కొనేందుకు 2021 జులై 19న రూ.32 లక్షలు సుధాకర్‌కు ఇచ్చాడు. డబ్బులు చేతికి రాగానే నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కడపకు పారిపోయాడు. ఆ డబ్బుల్లో నాగార్జున రెడ్డి అలియాస్ సుధీర్ కుమార్‌కు రూ.లక్ష ఇచ్చి, తన భార్యకు నాలుగు తులాల బంగారు చైన్ కొనిచ్చాడు. 30 లక్షల కంటే ఎక్కువ వస్తే అందులోంచి కొంత డబ్బును వారణాసిలోని దేవాలయం హుండీలో వేస్తానని మొక్కుకున్నాడు. అదే విధంగా అతను వారణాసి వెళ్లి హుండీలో రూ.2 లక్షలు వేసి హైదరాబాద్‌కు ఆగస్టు 5న ఉదయం 10 గంటలకు చెరుకున్నాడు. అప్పటికే నిఘా పెట్టిన ఎస్వోటీ పోలీసులు కడప బస్టాండ్ వద్ద నిందితుని పట్టుకున్నారు. రూ.25 లక్షల 20 వేలు, నాలుగు తులాల గోల్డ్ చైన్ స్వాధీనం చేసుకున్నారు. మిగతా డబ్బులు జల్సాలకు వాడుకున్నట్టు తేల్చారు. కేసును ఛేదించడంలో ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజరు కుమార్, ఎస్వోటీ డీసీపీ సందీప్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎస్వోటీ వెంకట్ రెడ్డి, ఏసీపీ భాస్కర్, ఇన్స్పెక్టర్ విజరు కుమార్‌ను డీసీపీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ చూపిన ఎస్వోటీ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి, ఎస్ఐ రవి రాజేశ్వర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య, రామకష్ణ, రాజశేఖర్, పోలీసు సిబ్బందికి రివార్డు అందజేశారు.