Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళిత బంధు ముందుగా పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలి
- పెంచిన వేతనాలు నెల రోజుల్లో చెల్లించాలి
- సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి
- రంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట కార్మికల ధర్నా ధర్నాలో పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి. వెంకట్
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
జీవో నెం 60ను కేవలం జమ్మికుంటకే పరిమితం చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జి. వెంకట్ డిమాండ్ చేశారు. పీఆర్సీ చైర్మన్ సిఫారస్ మేరకు కేటగిరిల వారిగా నిర్ణయించిన వేతనాలు అమలు చేయాలని శుక్రవారం గ్రామ పంచాయతీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్మికులు పనికి తగ్గ వేతనం చెల్లించాలని..సకాలంలో వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ చెలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ తిరుపతిరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గొన్న సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి జి. వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వానికి దళితుల మీద ప్రేమ ఉంటే మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న దళితులకు ముందు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధును ఇవ్వడాన్ని కార్మిక సంఘాలు స్వాగతిస్తున్నాయన్నారు. కానీ ఆ పథకం ఓట్ల బంధుగా మారకుండా..పేద ప్రజలందరికి అందేలా ఉండాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏండ్లుగా మున్సిపల్, పంచాయతీలో అధిక సంఖ్యలో పనిచేస్తున్న కార్మికులు దళిత కార్మికులే అన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. వారికి ఇవ్వాల్సిన వేతనాలు సకాలంలో చెల్లించాలన్నారు. జీవో నెం 60ను నెల రోజుల్లో పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే.. అసెంబ్లీ సమావేశ సమయంలో వేల సంఖ్యలలో కార్మికులను ఏకం చేసి అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం సీఐటీయు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నికలు వచ్చినప్పుడే దళితులు, కార్మికులు గుర్తుకువస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఇచ్చిన హామీలను మరిచి కార్మికుల ఊసురు పోసుకుంటున్నారని తెలిపారు. మున్సిపాల్టీలలో కార్మికులు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఫిక్స్డ్పే పద్ధతుల్లో పనిచేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా పనిచేస్తున్నప్పటికీ వీరిని పర్మినెంట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 అక్టోబర్లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న తీర్పును సైతం అమలు చేయలేదన్నారు. తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి. కిషన్ మాట్లాడుతూ పీఆర్సీ ఛైర్మన్ సిఫారసు చేసిన కేటగిరీల వారీగా నిర్ణయించిన వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేటగిరిలా వారిగా రూ.19,000, 22,900, 31,040లు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జివో నెం 60విడుదల చేసి రూ.15,600, రూ.19,500, రూ.22,750లు కేటగిరి వారిగా వేతనాలు అమలు చేయాలని ఆదేశాలు ఇవ్వడం కార్మికులను తీవ్ర నష్టానికి గురిచేస్తుందన్నారు. ఇటీవల జరిగిన దళిత ఎంపవర్మెంట్ సమావేశంలో సీఎం కేసీఆర్ మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచి పీఆర్సీ తరహాలో నిర్ణయాత్మకమైన ఉద్యోగ భద్రతకు చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తే కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం జీవోను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పాండు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బందికి 2019 అక్టోబర్లో జీవో నెం.51ని విడుదల చేసి వేతనాలను రూ.8,500లు పూర్తి స్థాయిలో కార్మికుల అందడం లేవని ఆవేదన వ్యక్తం చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడు చొప్పున ఖరారు చేశారని గుర్తు చేశారు. ఈ లెక్కన ఎన్నో ఏండ్లుగా గ్రామ పంచాయతీ కార్మికులుగా పనిచేస్తున్న వారు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జీవో నెం 51 ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బందికి పూర్తి స్థాయి వేతనాలు చెలించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.
కొత్తూరు : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా గ్రామపంచాయతీ కార్మికులకు పీఆర్సీని వెంటనే అమలు చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి బిసా సాయిబాబు కలెక్టరేట్ ధర్నా పాల్గొన్నారు. ధర్నాలో కొత్తూరు, నందిగామ మండలాలకు చెందిన గ్రామపంచాయతీ కార్మికులు, నాయకులు పెంటయ్య, జంగయ్య, సీ జంగయ్య, పద్మమ్మ, శంకరమ్మ, సత్యమ్మ, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.