Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతును రాజు చేయటమే సీఎం లక్ష్యం
- విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
రైతువిజ్ఞాన కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ నియోజకవర్గంలోని ధారూర్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను మంత్రి సబితారెడ్డి ప్రారంభించారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ధారూర్ మండలం మోమిన్ కలాన్, నాగారం, గురుడొట్ల, మున్నూర్ సోమారం పంచాయతీల్లో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజరు కుమార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేసేందుకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టి పక్కాగా అమలు చేస్తున్నదని తెలిపారు. ఇప్పటికే గిట్టుబాటు ధరకు పంట కొనుగోలు, 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా రైతుబంధు, రైతుబీమాను అమలు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో80 శాతానికి పైగా రైతుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కషి చేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయతో సుమారు 30 లక్షల బోర్లలో నీరు చేరిందన్నారు. తద్వారా 50 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌తో మిగిలిన ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. రూ.50 వేల రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు. అనంతరం మున్నూరుసోమారంలో రేషన్ కార్డులను మంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా విద్యాధికారి రేణుక, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, ఎంపీపీ విజయలక్ష్మీ హన్మంత్ రెడ్డి, జడ్పీటీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి, సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రాములు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.