Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోపన్పల్లి తండా గ్రామ వాసులు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
రోడ్డు విస్తరణలో కోల్పోతున్న ఇండ్లకు తగిన నష్ట పరిహారం ఇచ్చేంత వరకు ఇండ్లను కూల్చవద్దని గోపన్పల్లితండా వాసులు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి తండా నుంచి కొల్లూరు అవుటర్ రింగ్ రోడ్డుకు లింకు రోడ్డు (రేడియల్ రోడ్డు) నిర్మాణానికి గోపన్పల్లితండాలోని సుమారు 45 భవనాలు తొలగించేందుకు రెవెన్యూ అధికారులు సన్నద్దమవుతున్నారని తెలిపారు. రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజన్ అధికారులు ఎలాంటి సర్వే చేయకుండానే అర్హులను కాదని, ఇష్టారీతిగా వారికి నచ్చిన పేర్లు నమోదు చేసుకుని గత నెల 25న నోటీసులు అందించారని ఆరోపించారు. రోడ్డు విస్తరణ నిర్మాణానికి 45 మంది భవన యజమానులు ఒప్పుకున్నారని, జులై 5న స్థలాలకు సంబంధించిన పత్రాలను ఆర్డీఓ కార్యాలయంలో అందజేయాలని రెవెన్యూ అధికారులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసి తీసుకున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే నోటీసులు అందుకున్న వారికి శుక్రవారం రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోతో సమావేశం ఉందని గురువారం రాత్రి సమాచారం అందించారు. శుక్రవారం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిన భవన యజమానులతో సమావేశం నిర్వహించకుండా ఆర్డీవో లేరని అక్కడి సిబ్బంది చెప్పడంతో బాధాకరమన్నారు. వెనుదిరిగే సమయంలో సంబంధిత అధికారులు మాట్లాడే ప్రయత్నం చేశారు. రోడ్డు విస్తరణలో భవనాలు కోల్పోయే వారికి త్వరలోనే నష్టపరిహారం అందజేస్తామని ఈ లోపు నష్టపరిహారం చెక్కులను అందుకున్నట్లు సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేశారన్నారు. పరిహారం తీసుకోకముందే సంతకాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించగా, మీరు సంతకాలు పెట్టినా పెట్టకున్నా రోడ్డు నిర్మాణానికి మీ భవనాలను జేసీబీలతో తొలగించడం జరుగుతుందని అధికారులు బదులివ్వడంతో తండా వాసులు ఆందోళన చెందుతున్నారు. గోపన్పల్లి తండా గ్రామకంఠానికి చెందిన స్థలమైనప్పటికీ అధికారులు మాత్రం సర్వే నం.34కు చెందిన ప్రభుత్వ భూమి అంటూ ఖరీదు చేయకపోవడంతో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు డీఏవో అమరజ్యోతిని కలిసిన గ్రామస్తులు తమ భూములకు ఉన్న ఖరీదుకే నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.