Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్టీ 2017 ఉపాధ్యాయులకు మాస్టర్ స్కేల్ ను సవరించాలి
- టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడుసిహెచ్ వెంకట రత్నం డిమాండ్
నవతెలంగాణ-మర్పల్లి
రాష్ట్రంలోని కోవిడ్ ఉధృతి తగ్గి అన్ని కార్యకలాపాలు యధావిధిగా సాగుతున్నందున వెంటనే అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులను ప్రారంభించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వెంకట రత్నం అన్నారు. సోమవారం మండల పరిధిలోని సిరిపురం, కోత్లపురం, పట్లూర్, మండల కేంద్రంలోని కేజీబీవీ, మోడల్ స్కూల్ పాఠశాలల్లో వారు సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలపై కోవిడ్ ప్రభావం అంతగా ఉండదని ప్రారంభించుకోవచ్చని వైద్య నిపుణులు స్పష్టం చేశారన్నారు. పార్లమెంటరీ కమిటీ సైతం పంపించాలని సూచించిందని, మెజార్టీ తల్లిదండ్రులు పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలనే కోరుతున్నారన్నారు. పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు పాఠశాలల ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో జులై 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలు ప్రారంభించాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని కూడా పాఠశాలలను ఇంకా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష బోధన లేకపోవటంతో విద్యార్థులు మరో విద్యా సంవత్సరం నష్టపోవాల్సి వస్తోందన్నారు. టీఆర్టీ-2017 ఉపాధ్యాయులకు పీఆర్సీ పెరిగిన జీతాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండేండ్లుగా ప్రత్యక్ష విద్యాబోధన లేక విద్యార్థులు ఇంటి వద్ద సరైన సదుపాయాలు లేక చదువులో పూర్తిగా వెనుకబడి పోయారని, దీంతో భవిష్యత్తులో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. వెంటనే పాఠశాలను ప్రారంభించి విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి మల్లేశం, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, సాబీర్ అలీ, మండల నాయకులు పవన్ కుమార్, అంగీరస ప్రయోగ్, శ్రీనివాస్, ఎండి రఫీక్, రఫీయోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.