Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మంజూరైన ఏడు మురుగు నీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ), మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు వద్ద 7.0 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం నిర్మాణాల కోసం కావాల్సిన స్థలాన్ని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులతో కలిసి ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఏడు ఎస్టీపీల ద్వారా చెరువులు కలుషితం కాకుండా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చెరువులను సస్యశ్యామలం, సుందరీకరణ చేసి, ప్రజలకు చక్కటి ఆహ్లదకరమైన వాతావరణం కల్పిస్తామని ఎస్టీపీల నిర్మాణం కోసం స్థలాల పరిశీలన, అనుసరించాల్సిన విధానాలపై క్షేత్ర స్థాయిలో పర్యటించినట్టు చెప్పారు. నిర్మాణాల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులు సీజీఎన్ ప్రసన్న కుమార్, జీఎం వాస సత్యనారాయణ, డీజీఎం దీపాలి, రజిని, ఎస్టేట్ ఆఫీసర్ సత్యనారాయణ రావు, మేనేజర్లు శంకర్, వెంకట్, టౌన్ ప్లానింగ్ సంపత్, మెగా ప్రాజెక్ట్స్ ఇంజనీర్ నిస్సార్, తదితరులు పాల్గొన్నారు.