Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దళిత, గిరిజన దండోరా బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. అనుకున్నట్టుగానే జనం తరలిరావడంతో కాంగ్రెస్ నేతలు కొత్త ఊపుతో తిరుగు ప్రయాణమయ్యారు. ప్రధానంగా సీతక్క, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టి విక్రమార్క ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రసంగంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నిండింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పార్టీ కార్యకర్తలు, ప్రజలు రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని వింటూ హర్షం వ్యక్తం చేశారు. మధ్యాహ్నాం 3గంటల నుంచే నాయకుల ప్రసంగాలు ప్రారంభయ్యాయి. రేవంత్‌రెడ్డి సభా ప్రాంగనానికి 7గంటలకు చేరుకున్నారు. తుక్కుగూడ నుంచి భారీ బైక్ ర్యాలీతో రేవంత్‌రెడ్డి సభ వద్దకు చేరుకున్నారు. ఆయన వెంట మాజీ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి వచ్చారు. బొంగులూరు గేట్ నుంచి సైతం వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డుపై నిండిపోయాయి. రావిరాల, తుక్కుగూడ, ఇబ్రహీంపట్నం, విజయవాడ రహదారి, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చే రహదారులు కిటకిటలాడాయి.
ఈ సందర్భంగా బహిరంగ సభలో శాసనసభాపక్ష కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దళితులు, గిరిజనుల పట్ల వివక్ష చూపుతుందన్నారు. ఏడు సంవత్సరాల కాలంలో సామాజిక న్యాయం కొరవడిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. ఎన్నికల ముందు, తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేశాడని విమర్శించారు. దళితబంధు పేరుతో హుజూరాబాద్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మోసం చేసేందుకు వస్తున్నాడన్నారు. ఏడేళ్ళ క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. అందుకు కోసం కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న మోసాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందన్నారు.
ములుకు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ...రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమాల ద్వారా సాధించుకున్న అనేక హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు మరిచిందన్నారు. 1/70చట్టాన్ని కనుమరుగు చేసిందన్నారు. గిరిజన చట్టాలను సైతం కాలరాస్తున్నారని మండిపడ్డారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులను భూములకు దూరం చేస్తున్నాడన్నారు. అడవి నాశనం చేస్తున్నారన్న పేరుతో గిరిజనులపై కేసులు పెడుతున్న ప్రభుత్వం వేలాది ఎకరాల భూములు బడా పారిశ్రామికవేత్తలు అప్పటించడం వల్ల ఏపుగా పెరిగిన చెట్లను నరికి వేస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ప్రశ్నించారు. దళితులు గిరిజనులు తమ పొట్టకూటి కోసం సాగు చేసుకుంటే దాడులు చేసి, కేసు నమోదు చేస్తున్న ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటుందని ప్రశ్నించారు. ఓ పక్క హుజురాబాద్ ఎన్నికల పేరుతో దళిత బంధును ప్రకటించి మరోసారి మోసం చేయాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గిరిజన అభివృద్ధి సంస్థలు సైతం నిర్వీర్యం చేశారన్నారు. వీటికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఏఐసీసీ స్పోక్ పర్సన్ దాసోజు శ్రవన్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి 20 లక్షల మంది దళిత, ఆదివాసీలు ఉన్నారన్నారు. వీరి కోసం తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ సైతం అమలు చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు.
మాజీ మంత్రి గీతారెడ్డి మాట్లాడుతూ.. మోసపూరిత కేసీఆర్ ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. అందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మధుయాష్కి గౌడ్, ఫిరోజ్ ఫిరోజ్ ఖాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు కేసీఆర్ పంచన చేరి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేశారన్నారు. వీరికి తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచందర్ రెడ్డి, టీ.రామ్మోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహా రెడ్డి, జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ భూపతిగళ్ల మహిపాల్, రాంరెడ్డి తదితరులు ఉన్నారు.