Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
- శంషాబాద్ లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ
- జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమావేశం
నవతెలంగాణ-శంషాబాద్
కేంద్రం ఇచ్చే నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా తామే అభివృద్ధి చేసినట్టుగా, కేంద్రం నిధులు ఇవ్వలేదని అబద్ధం ప్రచారం చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. ఆదివారం శంషాబాద్ బేగం ఫంక్షన్ హాల్ లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ప్రవాస్ యోజన బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ కోవిడ్- 19 కష్టకాలంలో దేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ దేశంగా తీర్చిదిద్దారన్నారు. స్వయం సమృద్ధి సాధించడంలో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారు చేయించడంతో పాటు, డిఫెన్స్ లో 310 రకాల విదేశీ ఆయుధ సామాగ్రిని దిగుమతి రద్దు చేసుకుని సొంతంగా తయారు చేసుకునే దశకు చేరుకున్నామన్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ దేశం సాధించిన విజయాల్లో చాలా గొప్పదని పేర్కొన్నారు. కరోనా ఎదుర్కోవడంలో ఇప్పటికే ప్రపంచ దేశాలు వాటి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైతే భారతదేశం నిలదొక్కుకుని ముందుకు సాగుతున్నదన్నారు. డిఫెన్స్ లోనూ అనేక సంస్కరణలు తీసుకురావడం తో పాటు మోడీ అనేక సాహసో పేత చర్యల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ఐదోవ స్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు. ఉచిత బియ్యం పంపిణీ చేసే రేషన్ దుకాణాలకు కేంద్ర ప్రభుత్వం 85 శాతం నిధులు సమకూరుస్తూ పేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంటే కేవలం 15 శాతం నిధులిచ్చి, సీఎం కేసీఆర్ తమ ఫొటో పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇస్తుంటే రైల్వే, రోడ్లు , ఇరిగేషన్ వంటి రంగాల్లో అభివృద్ధి చేయకుండా వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలకు తాగునీరు అందక నేటికీ ఫిల్టర్ నీళ్లు, కలుషిత నీరు తాగుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పు తక్షణ అవసరమని అందుకోసం బిజెపిని బూతు స్థాయిలో బలపరచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పట్ల పార్టీ నాయకులకు , కార్యకర్తలకు అవగాహన కోసం సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, డాక్టర్ ప్రేమ్‌రాజ్ , చేవెళ్ల మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, రాష్ట్ర నాయకుడు బుక్క వేణుగోపాల్ , బీజేపీ జిల్లా కన్వీనర్ చింతల నందకిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డే చంద్రయ్య , మండల పార్టీ అధ్యక్షుడు చిటికెల వెంకటయ్య, బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు కొనమొల్ల దేవేందర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు మాది రెడ్డి మహిపాల్ రెడ్డి , వంశీ యాదవ్, బైతి శ్రీధర్ అంజన్ కుమార్ గౌడ్ , పాపయ్య , రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.