Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖానాపూర్ భూ నిర్వాసితుల పోరు ఉధృతం
- రాత్రింభవళ్లు కుటుంబాలతో జాగారం
- దేవేందర్‌నగర్ భూములను
- వదలి వెళ్లని రైతులు
- భూములను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారుల హుకుం
- భూమి చుట్టూ కంచె వేసిన అధికారులు
- రైతులకు సీపీఐ(ఎం) మద్దతు
ఖానాపూర్ భూ నిర్వాసితుల పోరు ఉధృతమౌతోంది. రైతు కుటుంబ సభ్యులు రాత్రిం భవళ్లు భూముల వద్దనే జాగారం చేస్తున్నారు. భూముల్లోనే టెంట్లు వేసుకుని అక్కడే పడుకున్నారు. దేవేందర్‌నగర్ కాలనీ భూములను వదలకుండా భీష్మించారు. రైతులు భూములను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారుల హుకుం జారీ చేస్తున్నారు. ఆ భూముల్లోకి రైతులు వెళ్లకుండా భూమి చుట్టూ రెవెన్యూ అధికారులు కంచె వేసి అడ్డుకుంటున్నారు. అందుకు నిరసనగా రైతులు మరింత ఉధృతంగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వంటా వార్పు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పేది.. చేసేది ఒకటిగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండుగ పూట కూడా తన నిరసనను కొనసాగిస్తున్నారు. వారి ఆందోళనకు సీపీఐ(ఎం) మద్దతు ప్రకటించింది. జిల్లా కార్దయర్శి వర్గ సభ్యులు సామెల్‌తో తహసీల్దార్ రామ్మోహన్, సీఐ సైదులు చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని సీపీఐ(ఎం) నాయకులు తెగేసి చెప్పారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రెవెన్యూ పరిధిలో ఖానాపూర్లోని సర్వే నెంబర్ 43/1లో సుమారుగా 11ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రభుత్వవం అసైన్ చేసింది. ఖానాపూర్ గ్రామానికి చెందిన అన్ని వర్గాల 60మంది రైతులకు పట్టాలు జారీ చేసింది. నాటి నుంచి ఆ భూములను సాగు చేసుకుంటున్నారు. అయితే ఖానాపూర్‌లో ఇండ్ల నివాసం కోసం ఎలాంటి ప్రభుత్వం భూమి లేకపోవడంతో ఆ భూముల్లో ఇండ్లను కట్టుకోవడా నికి పూనుకున్నారు. అందులో భాగంగానే కొందరు ఇండ్లను కట్టుకున్నారు. నాటి ప్రభుత్వం అందుకు అనుమతించింది. కానీ క్రమక్రమంగా ఆ భూములను ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడుకునేందుకు పూనుకుంటుంది. ఇచ్చిన ఇండ్ల స్థలాల పట్టాలను రద్దు చేసింది. ఈ తరుణంలో అనేక సార్లు ప్రభుత్వం అధికారులు చర్యలు జరిపారు. ఒక్కొ రైతు కుటుంబానికి రెండు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ నేటికీ ఆ హామీ నెరవేరలేదు. దాంతో ఖానాపూర్ రైతుల నుంచి వ్యతిరేక వ్యక్తమవుతుంది. తమకు ఇచ్చిన భూమి హక్కులను రద్దు చేయడం, ఇండ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో ఆ భూముల్లో నిరసనకు దిగుతున్నారు. వారం రోజుల క్రితం ఆ భూములను ట్రాక్టర్ల ఉపయోగించి దున్నేశారు. ఉలవల చల్లేందుకు పూనుకున్నారు. దాంతో అధికారులు అడ్డుకున్నారు. భూముల్లోకి రావద్దని అధి కారులు హుకుం జారీ చేస్తున్నారు. భూముల్లోకి రైతులు వెళ్లకుండా కంచె వేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇండ్ల స్థలాలు ఇచ్చినట్టు ఇచ్చి అడ్డుకోవడం ఏమిటనీ ప్రశ్నిస్తున్నారు. తాము చావడానికైనా సిద్ధమే, కానీ మా భూమిని వదిలేది లేదంటూ గ్రామస్తులు ఇక్కడే రాత్రింబవళ్లు జాగారం చేస్తున్నారు. వంటావార్పు చేస్తూ నిరసన వ్యక్తమ చేస్తున్నారు. రెండు రోజులుగా నిరసన కొనసాగిస్తున్నారు. తమ భూమిని తిరిగిచ్చే వరకూ నిరసన వ్యక్తం చేస్తామని వారు తేల్చి చెబుతున్నారు.