Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు గోరింకల నరసింహ
నవతెలంగాణ-కందుకూరు
రీ సెర్కులేషన్ బ్యాటరీ కంపెనీని వెంటనే మూసివేయాలని మత్స్య కార్మికుల సంఘం రాష్ట్ర నాయకులు గోరింకల నరసింహా డిమాండ్ చేశారు. మంగళవారం మండల పరిధిలోని అన్నోజిగూడ గ్రామ పరిధిలో రీ సర్కులేషన్ బ్యాటరీ కంపెనీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ రసాయనాలు పక్కనే ఉన్న కూసి కుంట చెరువులోకి ప్రవహించడంతో అందులో వేసిన చేప పిల్లలు మృత్యువాత పడ్డాయనీ, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.10 లక్షల విలువ గల చేపలు మృత్యువాత పడ్డాయనీ, దీంతో మత్స్య కార్మికులకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరారు. పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉందని, బ్యాటరీ రీ సర్కులేషన్ వ్యర్థాల రసాయణాల వల్ల విద్యార్థులకు అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రీ సర్కులేషన్ బ్యాటరీ కంపెనీ మూతవేయాలని లేదంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పుల గాజుల జంగయ్య, నాయకులు కాకి మధుసూదన్, గణేష్, సురేష్, పంచాయతీ సభ్యులు గోదాసు గణేష్ పాల్గొన్నారు.