Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- శేరిలింగంపల్లి
రాచకొండ విశ్వనాథ శాస్త్రి ప్రపంచ రచయితల సరసన చేరదగిన అగ్రశ్రేణి రచయిత అని పలువురు వక్తలు కొనియాడారు. హైదరాబాదు విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ, మాతృభాషలు అంతరిస్తున్న భాషల అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి రచనా వైభవంపై రెండు రోజుల అంతర్జాల సమావేశం గురువారం వైభవంగా ప్రారంభమైంది. రావిశాస్త్రి నూరవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆచార్య పిల్లలమర్రి రాములు మాట్లాడుతూ సాహిత్యం ప్రజల జీవితాన్ని ప్రభావితం చేయాలని రావిశాస్త్రి బలంగా విశ్వసించేవారన్నారని తెలిపారు. అభ్యుదయ, విప్లవ రచయితల సంఘాల ఆవిర్భవించడంలో రావిశాస్త్రి పాత్ర కీలకమైనదని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ విశ్వవిద్యాలయం ప్రొ-వైస్ చాన్సలర్ ఆచార్య ఆర్.ఎస్. సర్రాజు మాట్లాడుతూ రావిశాస్త్రి అని సున్నిత మనస్కుడని, భావుకత కలిగిన రచయితని అన్నారు. ఉత్తరాంధ్ర మాండలికానికి తన రచనలలో అగ్రతాంబూలమిచ్చారని వివరించారు. రుక్కులు, గోవులొస్తున్నాయి జాగ్రత్త... మొదలైన రచనలలో చిన్న చిన్న వాక్యాలలో గొప్ప సంఘటనలను, వ్యవస్థలను ఇమిడ్చారన్నారు. సామాజిక చలన సూత్రాలను ఆయన ఆకళించుకొన్న పద్ధతి చాలా అరుదైనదని కొనియాడారు.సదస్సులో గౌరవ అతిథిగా పాల్గొన్న మానవీయ శాస్త్రాల విభాగం డీన్ ఆచార్య్ వి. కృష్ణ మాట్లాడుతూ, రావిశాస్త్రి వృత్తిరీత్యా లాయరు అయినప్పటికీ, ఎప్పుడూ ఆయన పేదలు, కష్టజీవులు, పీడితుల పక్షానే నిలిచారన్నారు. ఆయన రచనలన్నీ ఆంగ్లభాషలోకి అనువాదమైతే, ప్రపంచ రచయితల సరసన చేరతారన్నారు. ఆరు సారాకథలు, ఆరు సారో కథలు... వంటి రచనలు సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపాయన్నారు. సదస్సులో కీలకోపన్యాసం చేసిన కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారు స్వాతంత్రానంతర తొలితరం రచయితగా అభివర్ణించారు. కథ, నవల, నాటక ప్రక్రియలలో అద్భుతమైన రచనలను రావిశాస్త్రి మనకు అందించారన్నారు. నిజం, పిపీలికం, అల్పజీవి వంటి రచనలు తెలుగు పాఠకులపై విశేషమైన ప్రభావాన్ని చూపాయని తెలిపారు. మంచికి గాని చెడుకు సాయం చేయకూడదని తాను భావిస్తాను అని చెప్పిన రావిశాస్త్రి గారి వాక్యాన్ని వారి రచనల సారంగా మనం గ్రహించవచ్చని వివరించారు. ఆచార్య పమ్మి పవన్ కుమార్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఈ సదస్సులో తెలుగు శాఖ ఆచార్యులు ఆచార్య జి. అరుణ కుమారి, ఆచార్య ఎమ్. గోనానాయక్, ఆచార్య డి. విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం మూడు సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వర రావు, ఆచార్య జి. అరుణ కుమారి, ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య పమ్మి పవన్ కుమార్, డా. బి. తిరుపతి, డా. బి. భుజంగరెడ్డి, డా. డి. విజయకుమారిలతో పాటు, తెలుగుశాఖలోని పలువురు ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.