Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు జరిగే బతుకమ్మ సంబురాలకు రానున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- భారీ ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,జడ్పీటీసీ తన్విరాజు
నవతెలంగాణ-శంషాబాద్
చారిత్రాత్మక పురావస్తు శాఖ గుర్తించిన అతి పురాతనమైన దేవాలయం శంషాబాద్ మండ లంలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం బతుకమ్మ వేడుకలకు ముస్తాబయింది. నేడు (శుక్ర వారం) బతుకమ్మ వేడుకల కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జాగృతి అధ్య క్షురాలు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రానుండడం ప్రత్యేకతను సంతరించుకుంది . దీంతో బతుకమ్మ సంబరాల ఏర్పాట్లలో ఏమాత్రం లోటు లేకుండా రాజేంద్రనగర్ శాసనసభ్యులు టి. ప్రకాష్ గౌడ్ , స్థానిక జడ్పీటీసీ నీరటి తన్వి రాజు దగ్గరుండి ఏర్పాట్టు చేస్తున్నారు. శంషాబాద్ మండలంతో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మహిళలు రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తరలి రానున్నారు. కవిత రాక కోసం శంషాబాద్ నుంచి అమ్మపల్లి దేవా లయం వరకు స్వాగత ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అమ్మపల్లి ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమం ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏర్పాట్లను పరిశీలించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ రాజీవ్ సాగర్ అమ్మపల్లికి వచ్చారు. స్థానిక నాయకులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నీరటి తన్విరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కె. చంద్రారెడ్డి, ఎం. మోహన్రావు, బుర్కుంట సతీష్, సందనవెల్లి శ్రీనివాస్, హీరేకార్ శివాజీ, తదితరులు పాల్గొన్నారు.
ఆలయ చరిత్ర ఘనం
నర్కూడ గ్రామపంచాయతీ పరిధిలోని అమ్మపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సుమారు 6 వందల సంవత్సరాల క్రితం నిర్మాణం జరిగింది. నగరానికి అతి దగ్గరలో ఉన్న ఈ ఆలయం చారిత్రక నేపథ్యం కలిగి ఉంది . సుమారు 250 ఎకరాల ఆలయ భూమి ఉండగా 9 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం ఉంది. ఆలయానికి ప్రధాన రాజగోపురం ( గాలి గోపురం ) ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. రెండు వైపులా కోనేరు మరోవైపు గోల్మాల్ బంగ్లా ఎదురుగా కళ్యాణ మండపం, దాని పక్కన రథం నిలిపే స్థలం ఉన్నాయి. పురాతన నిర్మాణాలను ఇటీవల అందుబాటులోకి తేవడం జరిగింది. ఉత్తరం వైపున షాబాదు ప్రధాన రహదారి 34 అడుగుల హనుమాన్ విగ్రహం ఇటీవల ప్రారంభించారు.
రాజగోపురం పునర్నిర్మాణం
శిథిలావస్థకు చేరుకున్న శ్రీ సీతా రామచంద్రస్వామి దేవస్థానం పునర్నిర్మాణం చేయ డానికి దాతలు సంకల్పించారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ శాసనసభ్యుడు టి . ప్రకాష్ గౌడ్ , శంషాబాద్ జడ్పీటీసీ నీరటి తన్విరాజు ప్రత్యేక చొరవ తీసుకుని కోటి రూపాయలతో రాజగోపురం పునర్నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. గతంలో ఏ రకంగా నిర్మాణం జరిగిందో అదే పద్ధతిలో అవే నిర్మాణాలను పున రుద్ధరిస్తున్నారు. అందుకోసం రాజ గోపురం ప్రధాన ద్వారం మూసి ఉంచారు. నిర్మాణం మరమ్మతులు పూర్తయితే ఆలయరూపు రేఖలు మారిపోయే అవకాశం ఉంది.
సందడిగా మారనున్న అమ్మపల్లి
మొట్టమొదటిసారిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమ్మపల్లికి వస్తుండటంతో వివిధ గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి బతుకమ్మ సంబురాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్య మంత్రి కూతురు, బతుకమ్మ సంబరాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన కవిత రాకపట్ల ఆసక్తి నెలకొన్నది.