Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మందకోడిగా క్రీడా ప్రాంగణాల నిర్మాణాలు
- రైతు వేదికలు, పల్లె ప్రకృతివనాలకు అందని నిధులు
- జాడ లేని ఆర్థిక సంఘం నిధులు
- పంచాయతీల్లో పేరుకుపోయిన బకాయిలు
- ఆందోళనలో సర్పంచ్లు
నిధులు లేమీతో స్థానిక సంస్థలు వెలవెలబోతున్నాయి. గ్రామీణ అభివృద్ధి కోసం పథకాలు బాగానే ఉన్నప్పటికీ.. అమలు తీరులో మాత్రం సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన వైకుంఠదామాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, సీసీరోడ్లు, డ్రయినేజీ నిర్మాణాలు, క్రీడా ప్రాంగాణం వంటి పనులు పూర్తి చేసిన గుత్తెదార్లకు గడువు ముగిసినా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల భారం తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పనులు చేసేందుకు గుత్తేదారు ఎవరు ముందుకు రాకపోవడంతో చేసేది ఏమీ లేక సర్పంచులు గుత్తేదారుల అవతారమెత్తి పనులు చేశారు. పనుల కోసం చేసిన అప్పులు కుప్పలే వారి మెడకు పెద్ద గుదిబండగా మారాయి.
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో కొత్త పనులకు టెండర్లు పిలిచినా చేసేందుకు ముందుకు రావడం లేదు. మన ఊరు- మన బడి పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త భవనాల నిర్మాణాలు చేయాల్సి ఉంది. ఆ నిర్మాణాలు చేపట్టేందుకు గుత్తేదారులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ పథకం ముందుకు సాగడం లేదు. ఎమ్మెల్యేల అనుచరులు, వారి బంధువులు, రాజకీయ, అధికార పలుకుబడి ఉన్న బడా కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లిస్తున్నారు. సాధారణ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతరులు చేసిన పనులకు మాత్రం బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం ప్రదర్శిస్తున్నారు. అదేమంటే ప్రభు త్వం నుంచి నిధులు మంజూరు కాలేదని, వచ్చిన వెంటనే చెల్లిస్తామని జిల్లా ట్రెజరీ ఆఫీసర్లు చెప్పుతుండటం గమ నార్హం. ఇలా పాత బకాయిల కోసం డీటీఓ ఆఫీసుకు రోజు కు కనీసం పది మంది కాంట్రాక్టర్లు వచ్చి పోతున్నారంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామ పంచాయితీలు ఉండగా, వీటి నిర్వహాణ కోసం రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి 2022 ఏప్రిల్ నుంచి జూన్ వరకు రూ.28 కోట్లు మంజూరు కాగా, 2021-22 ఆర్థిఖ సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.59 కోట్లు మంజూరైంది. ఇది కాకుండా 2021-22 ఆర్థిక ఏడాది మొత్తం గ్రామ పంచాయితీ నుంచి 99 శాతం అంటే రూ.23.93 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. పారిశుధ్య నిర్వహాణ, హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం, సిబ్బంది వేతనాల చెల్లింపు, సహా ఇతర అభివృద్ధి పనుల కోసం ఈ నిధులు ఖర్చు చేశారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఇప్పటి వరకు 556 కంపోస్ట్ యార్డులు, 557 శ్మశాన వాటికలు, 865 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 83 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించారు. ఇందుకు ఒక్కో రైతు వేదిక భవనానికి రూ.22 లక్షలు చెల్లించనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈ పనులు దక్కించుకుని, పనులు పూర్తి చేసిన వారికి ఏళ్ల తరబడి బిల్లులు చెల్లించడం లేదు. అదేమంటే ప్రభుత్వం నుంచి ఆశించిన మేర నిధులు రావడం లేదని చెప్పుతున్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చే గుత్తేదార్లకు అధికారుల నుంచి వేదింపులు తప్పడం లేదు.
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులను గతంలో తన వాటా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఎకౌంట్లో జమ చేసేది. దీనికి రాష్ట్ర ప్రభు త్వం కూడా చెల్లించాల్సిన వాటాను కలిసి జిల్లా ట్రెజరీలకు బదిలీ చేసేది. అటు నుంచి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు చేసిన గుత్తేదార్లకు డబ్బులు చెల్లించేవారు. అయితే కేంద్రం తన వాటాగా కేటాయిస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధేశించిన పనులకు కాకుండా ఇతర పథకాలకు మళ్లీస్తుండటాన్ని గుర్తించింది. చేసిన పనులకు కేంద్రం తన వాటా ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించాల్సిన మొత్తం చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సకాలంలో నిధులు మంజూరు చేయడం లేదనే అపవాదును కేంద్రంపైకి నెట్టేస్తున్నాయి. కేంద్రం ఈ అంశాన్ని గుర్తించింది. ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీలో భాగంగా చెల్లించే మొత్తాన్ని నేరుగా కూలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. తాజాగా గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన నిధులను కూడా నేరుగా ఆయా పంచాయతీ ల ఖాళాల్లో జమ చేయాలని నిర్ణయించి, ఆ మేరకు బ్యాంకుల్లో ప్రత్యేక అకౌంట్లను కూడా తెరిపించింది. 15వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీల ఖాతా ల్లో జమ కావాల్సి ఉంది. కానీ మూడు నెలలుగా రావడం లేదు. దీంతో బిల్లుల చెల్లింపు కూడా ఇబ్బందిగా మారింది.