Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే దేవదాయ శాఖ పేరును తొలగించాలి
- ఆ భూములకు ఎండోమెంట్‌కు ఎలాంటి సంబంధం లేదు
- భూస్వాముల దురిబుద్ధితోనే
- కౌలు రైతులకు అన్యాయం
- స్థానిక ఎమ్మెల్యే స్పందించకపోవడం దుర్మార్గం
- 38/ఈ ప్రకారం అర్హులందరికీ పట్టాలివ్వాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్
నవతెలంగాణ-యాచారం
దాదాపు మూడు తరాల నుంచి 1400 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నా కౌలు రైతులకు ప్రభుత్వం పట్టాలివ్వకుంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్ హెచ్చరించారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని సింగారం, తాడిపర్తి, కుర్మిద్ధ, నందివనపర్తి గ్రామాల రైతులు వ్యవ సాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో మండల కార్యాలయానికి పాదయాత్రగా వెళ్లారు. అనంతరం రైతులతో కలిసి తహసీల్దార్ సుచరితకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ఆనాడు కొంతమంది భూస్వాములు 1400 ఎకరాల సాగు భూమి కౌలు రైతులకు చెందకుండా దేవదాయ శాఖ పేరు రాశారని అన్నారు. అప్పటి ప్రభుత్వాలు కౌలుదారు చట్టం 37/ఆ ప్రకారం రైతులకు సర్టిఫికెట్లు అందజేసినా, 38/ఈ ప్రకారం పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా దేవాదాయ శాఖ పేరు రాయడం దుర్మార్గమన్నారు.కొన్నేండ్లుగా నాలుగు గ్రామాల రైతులు 14 వందల ఎకరాల్లో సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారని వివరించారు. ఇక్కడున్న అధికారులు గానీ, ప్రభుత్వం కానీ రైతులు పట్టాలు ఇవ్వాలని వేడుకున్నా, పట్టించుకోవడం లేదని ధ్వజ మెత్తారు. ఈ ప్రాంత రైతుల ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పట్టించుకోకపోవడం దౌర్భాగ్యంగా భావించాల్సి వస్తుందని తెలిపారు. రెవెన్యూ అధికారులు వెంటనే సర్వే చేసి రైతుల పేర్లను ధరణిలో నమోదు చేయాలని కోరారు. ఈ భూమికి ఎండోమెంట్‌కు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఇక్కడున్న రైతుల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు రైతులను పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శిం చారు. రైతులకు పట్టాలు వచ్చేంతవరకు ఎర్రజెండా అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే మండలం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ రైతులతో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల అంజయ్య, ఐద్వా మండల కార్యదర్శి మస్కు అరుణ, సీపీఐ(ఎం) మండల కార్యవర్గ సభ్యులు చందునాయక్, సర్పంచులు దంతుక పెద్దయ్య, దోస రమేశ్, ఉప సర్పంచులు నరసింహ, రమేష్ నాయక్, నాలుగు గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.