Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలుగుకు అంగులం దూరంలో తొనికిసలాడుతున్న చెరువు
- 39పీట్లకు చేరిన నీరు
- మరో పీటు నీరు చేరితే అలుగు దుంకనుంది
- 40ఏండ్ల తర్వాత మొదటి సారి
- మూడేండ్లుగా నీరు చేరుతున్న వైనం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గత 35 ఏండ్లుగా తీవ్ర కరువు.. నీరు లేక కళతప్పిన ఇబ్రహీంపట్నం చెరువు.. ఇన్నాళ్లు నీటితో కళకళలాడింది లేదు. కంపచెట్లే దర్శనమిచ్చాయి. తీవ్ర కరువు ప్రభావంతో ఆయకట్టు భూములు బీరువాడాయి. వలసలు పెరిగాయి. ఒకప్పుడు 100 గ్రామాలకు ఉపాధినిచ్చిన ఈ చెరువును తలుచుకుని మదన పడిన వారు లేకపోలేదు. ఇక గత మూడేండ్లుగా కాలం మారింది. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. కళతప్పిన చెరువులోకి నీరు చేరడం ఆరంభమైంది. ఇక ఈ చెరువు పని అయిపోయిందన్న నోళ్లకు తాళాలుపడ్డాయి. ఏడాదికేడాది ఇబ్రహీంపట్నం చెరువులోకి నీరు రావడం ఆరంభమైంది. 2020లో 30 పీట్ల వరకు వచ్చినా, ఆగిపోయినా నీరు 2021లో కాస్త పెరిగింది. ఇక నీటికి కొదువ లేదనుకున్న తరుణంలో ఈ సారి ఆ స్థాయిపెరిగింది. 2020 పూర్వం వరకు కంపచెట్లతో దర్శనం ఇచ్చిన చెరువు నేడు నీటి పరవళ్లతో తొనికిసలాడుతోంది. పై నుంచి వాగులు, వంకలు అన్ని ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వైపు మల్లాయి. ఎగువ ప్రాంతంలో విస్తారమైన వర్షాలకు చెరువులు, కుంటలు నిండి పారుతున్నాయి. గొలుసుకట్టు చెరువులు పరవళ్లు తొక్కుతున్నాయి. అందుకు తోడు మూడు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలు జత కలిశాయి. ఇంకేముంది రోజురోజుకూ ఇబ్రహీంపట్నం చెరువు నీటిమట్టం పెరు గుతూ వస్తుంది. చిన్న చెరువు, పెద్ద చెరువు ఒకటయ్యాయి. అలుగు దుంకేందుకు ఆరాట పడుతున్నాయి. ఇక ఎఫ్టీఎల్ అక్రమంగా వెలిసిన ఇండల్లోకి నీరు చేరుతోంది. అక్రమ కట్టడాలను పటాపంచలు చేస్తూ చెరువు నీటి మట్టం అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఇక గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో మాదాపూర్, రావిరాల, చర్లపటేల్గూడ, వెలిమినేడు తదితర ప్రాంతాల నుంచి వరద ఉధృతంగా ఇబ్రహీం పట్నం చెరువులోకి చేరుతుంది.పోచారం మత్తడి పరవళ్లు తొక్కుతోంది. గురువారం వరకు నిన్నటికీ 36 ఫీట్ల వరకే ఉన్న నీరు శుక్రవారం నాటికి 39 ఫీట్లకు చేరుకుంది. ఇంకేముంది మరో అడుగు దూరం మాత్రమే అలుగు దుకేందుకు సిద్ధంగా ఉంది. ఉప్పరిగూడ గేటు నుంచి ఊరిలోకి వెళ్లే రహదారి నుంచి అలుగు దుకంనుంది. అందుకు అంగుళం దూరంలోనే వచ్చి ఆగింది. ఇవాళా? రేపా? ఉన్నట్టు ఎదురుచూస్తోంది. ఇక పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్రహీంపట్నం చెరువు అలుగును దుంకే దృశ్యాలను కల్లారా చూసేందుకు తరలివస్తున్నారు. మేము పుట్టి ఎరగము! ఇబ్రహీంపట్నం చెరువు అలుగు పారిందని తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఇబ్రహీంపట్నం చెరువు నిండుకుండలా మారి ఆహ్లాదాన్ని పంచుతోంది. గత 40 సంవత్సరాల క్రితం ఇబ్రహీంపట్నం చెరువు అలుగు దుంకడంతో శేరిగూడ-శ్రీఇందు ఇంజనీరింగ్ కళాశాల మధ్యన వాగు ఉధృతంగా సాగడంతో నాటు బత్తాయి పండ్ల లారీ వాగులో కొట్టుకుపోయిందన్న చర్చలు ఊపందుకుంటున్నాయి. మళ్లీ 40 ఏండ్ల తర్వాత చెరువును నిండి అలుగు పారే దృశ్యాలను ఈ సారి చూస్తా మన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పైన ఉన్న పోచారం మత్తడి వాగు దుంకి ఉధృతంగా చెరువులోకి నీరు చేరుతుండడంతో అంతకంతకు నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. ఇబ్రహీంపట్నం చెరువు ఆయకట్టు సుమారు 1250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పంట పొలాల్లో నీరు ఉబికి వస్తోంది. నీరు పెరుగుతుండటంతో ఆయకట్టు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అంతంతా మాత్రాంగానే సాగు చేసినప్పటికీ యాసంగి సాగును చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఏదేమైనప్పటికీ ఇబ్రహీంపట్నం చెరువు సుమారు 40 సంవత్సరాల తర్వాత అలుగు పారే అవకాశం ఉండటంతో నాటి కురువృద్ధులు సైతం గత జ్ఞాపకాలను నెమ రేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇబ్రహీంపట్నం చెరువు నిండిపోవడంతో పోచారం, ఉప్పరిగూడ, చర్లపటేల్గూడ గ్రామాల వ్యవసాయ పంట పొలాలు నీట మునిగాయి. రైతులు తీవ్ర నష్టాన్ని చవి చూస్తున్నారు. ఈ రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో నీటిలో మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు. నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.