Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 9.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
- నీట మునిగిన గణపతి కాలనీ
- ఇండ్లలోకి చేరిన వరద నీరు
నవతెలంగాణ-కొత్తూరు
కొత్తూరు మున్సిపాలిటీలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జనజీవనం అతలాకుతలమైంది. ఇండ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా రాత్రి భారీ వర్షం కురవడంతో చూస్తుండగానే ఇల్లంతా మోకాలు లోతు నీరు వచ్చి చేరింది. 9.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అసిస్టెంట్ స్టాటిజికల్ అధికారి నరేందర్ తెలిపారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాతుక దేవేందర్ యాదవ్, వైస్ చైర్మన్ డోలి రవీందర్, కౌన్సిలర్స్ కోస్గి శ్రీనివాస్, తిమ్మాపూర్ ఎంపీటీసీ రాజేందర్ గౌడ్ లు కలిసి నీట మునిగిన గణపతి కాలనీ, భరత్ నగర్ కాలనీ, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్, తిమ్మాపూర్ చౌరస్తా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్లో రోడ్లపై భారీగా నిలిచిన వర్షం నీటిని కౌన్సిలర్ కోస్గి శ్రీనివాస్ మున్సిపల్ సిబ్బందిని పిలిపించి మురుగు కాలువను శుభ్రపరచి నీటిని బయటికి పంపించారు. వరద నీరు చేరిన ఇండ్లను, కాలనీలను తిరిగి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఊహించని విధంగా ఒక్కసారిగా భారీ వర్షం కుడవడంతో ఈ సమస్య ఏర్పడిందని తెలిపారు. వరద సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
హైకోర్టుకు వెళ్తాం...
కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గణపతి కాలనీలో వెంచర్ నిర్వాహకులు ఎలాంటి మాలిక వసతులు కల్పించలేదని, మున్సిపాలిటీకి చెందిన ఓ బడా వ్యాపారవేత్త పాటు కాలువను కబ్జా చేయడంతోనే వర్షం కురిసిన ప్రతిసారి ఇండ్లలోకి భారీగా నీరు వచ్చి చేరుతుందని మున్సిపాలిటీకి చెందిన కొంతమంది యువకులు పేర్కొన్నారు. కబ్జా చేసిన పాటు కాలువను విడిపించి గణపతి కాలనీ వాసుల కష్టాలను తీర్చాలని ఎన్ని ఫిర్యాదులు అందజేసినా, అధికారులు స్పందించడం లేదన్నారు. అందుకు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసేందుకు మున్సిపాలిటీకి చెందిన కొంతమంది యువకులు సిద్ధమవుతున్నారు.