Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పుస్తకాన్ని ఆవిష్కరించిన తెమ్జు అధ్యక్షులు ఇస్మాయిల్
నవతెలంగాణ-మియాపూర్
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) మాజీ ఎగ్జిక్యూ టివ్ డైరెక్టర్ లాడే ధనుంజయ రాసిన ''డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారు'' అనే పుస్తకాన్ని శుక్రవారం చందానగర్ లోని పిజెఆర్ స్టేడియంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్మాయిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రచయిత ధనుంజయతో పాటు పలువురు ప్రొఫెసర్లు, పలు సంఘాల నాయకులు మాట్లాడారు. భారత దేశనాయకత్వం మొదటి నుండి అంబేద్కర్ పై వివక్ష చూపుతూనే ఉందని అన్నారు. పార్లమెంటులో కూడా నాటి నెహ్రూ ప్రభుత్వం అంబేద్కర్ సామర్థ్యానికి తగిన పదవి ఇవ్వలేదని అన్నారు. దీంతోపాటు సగానికి పైగా జనాభా ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అవ కాశం కల్పించేందుకు బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలన్న అంబేద్కర్ డిమాండ్‌ను కూడా ఆ ప్రభుత్వం పక్కన పెట్టిందన్నారు. భారత దేశ విదేశాంగ విధానంలో నెహ్రూ ప్రభుత్వం ఒంటెద్దు పోకడ ఆలంబించిందని విమర్శించారు. మహిళలను మనువాదం కేవలం మరమనుసులుగా మాత్రమే చూసిందని, వారికి ఎలాంటి హక్కులు ఇవ్వలేదని అన్నారు. ఆ రకంగా ఆధునిక సమాజానికి దూరంగా ఉంచిన మహిళలకు అన్నిరంగాల్లో సమాన హక్కులు ఇవ్వాలని అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును తీసుకురావడం జరిగిందన్నారు. దీనిని కూడా ఆనాటి పార్లమెంటు చర్చకు తీసుకు రాలేదని విమర్శించారు. నూటికి 90 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళల అభ్యున్నతికి వ్యతి రేకంగా నెహ్రూ ప్రభుత్వం వ్యవహరించడం వలననే అంబే ద్కర్ రాజీనామా చేశారని తెలిపారు. ఆ రోజు అంబేద్కర్ కోరుకున్న విధానాలను ఇప్పటికీ పాలకులు అమలు చేయడం లేదని విమర్శించారు. అందుకోసమే అభివృద్ధిలో భారతదేశ చాలా వెనకబడిపోయిందని అన్నారు. దీనికి తోడు బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని మార్చాలని నేటి మనువాద పాలకులు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లో ఏ ఒక్క కులానికి, మతానికి, వర్గానికో కాకుండా, సర్వ మానవాళి సకల జీవరాసుల రక్షణతో పాటు స్వేచ్ఛాయుత జీవనానికి అవకాశం కల్పించారని కొనియాడారు. అసమాన తల మనువాదం, సమానత్వాన్ని కోరుకునే మానవతా వా దానికి మధ్యన దేశంలో యుద్ధం జరుగుతుందని అన్నారు. అత్యధిక శాతంగా ఉన్న బహుజనులు, అభ్యుదయవాదులం దరూ పూలే, అంబేద్కర్లు చూపిన బాటలో సమసమాజ నిర్మాణం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. సీనియర్ జర్నలిస్టు లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి మందగడ్డ విక్రమ్ కుమార్, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డాక్టర్ నాళేశ్వరం శంకరం, హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీ ప్రొఫెసర్లు దార్ల వెంకటేశ్వర రావు, శ్రీపతి రాముడు, అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం, బీసీ దళ్ జాతీయ అధ్యక్షులు దండ్రు కుమారస్వామి, అంబేద్కర్ యువశక్తి, దళిత రత్న అవార్డు గ్రహీత మందగడ్డ విమల్ కుమార్, సినీ నిర్మాత గాలి గిరిధర్, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రారం శంకర్ తదితరులు పాల్గొన్నారు.