Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టాలు ఇచ్చేవరకు పోరాడుతాం
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ
నవతెలంగాణ-కందుకూరు
గుడిసెలు వేసుకున్న ప్రతి ఒక్కరికీ ఇండ్ల స్థలాలు చూపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్వెస్లీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కందుకూరు మండల్ కందుకూరు రెవెన్యూ, కొత్తగూడ గ్రామపంచాయతీ, సర్వేనెంబర్ 788 లో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ స్థలంలో సుమారుగా 300 మంది పేదలు ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున ఇండ్ల స్థలాలు కేటాయించాలని, గత నాలుగైదు రోజుల నుంచి రాత్రింబవళ్లు అక్కడే ఉండి పోరాటం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పేదవాళ్లకు ఉండడానికి 60 గజాల స్థలం ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకారం తెలుపాలని కోరారు. రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఎంతోమంది ప్రభుత్వ స్థలాలు భూకాబ్జా చేస్తుంటే, ఈ పోలీసు యంత్రాంగం ఏం చేస్తుందని విమ ర్శించారు. రెవెన్యూ యంత్రాంగం భూ కబ్జాదారుల పక్షం చేరి, తమాషాలు చూసున్నారని దుయ్య బట్టారు. రంగారెడ్డి జిల్లాలలో అనేకమంది ప్రభుత్వ అండతో భూకబ్జాలు చేశారని, సర్వే నెంబర్లతో సహా తాము జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదన్నారు. పేదలు గుడిసెలు వేస్తే మాత్రం పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం ఆగ మేఘాలపై వచ్చి, 'మీ మీద కేసులు పెడతాం, గుడిసెలు వేసుకోవద్దని' హెచ్చరికలు జారీ చేయడం సరైంది కాదన్నారు. 16 ఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 188 మందికి ఒక్కొక్కరికి 60 గజాల చొప్పున ఇండ్ల స్థలాల సర్టిఫికెట్లు ఇచ్చారని, వారందరికీ ఆ భూములు చూపించాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు తమ పోరాటం ఆగబోదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్, జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామ్ చందర్, మండల కమిటీ సభ్యులు అంకగళ్ల కుమార్, బుట్టి బాలరాజ్, నాయకులు పుల గాజుల జంగయ్య, కొమ్మగళ్ళ బిక్షపతి, ఎస్ఎఫ్ఐ మండల సహాయ కార్యదర్శి సాత్రి సిద్దు, ఇబ్రహీంపట్నం సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.