Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 ఏండ్ల తరువాత కలిసిన స్నేహబంధం
- గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న వైనం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జీవితంలో బాల్యం బంగారు జ్ఞాపకాల ఖజానా ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండే తీపి జ్ఞాపకాలు చిన్నతనంలోనే ఉంటాయి. తను చదువుకునే రోజులు, చేసే అల్లరి, స్నేహితుల కోసం చేసే ఫైటింగ్లు వారితో కలిసి ఆడిన ఆటలు మళ్లీ అవన్నీ గుర్తు చేసుకుంటూ 30 ఏండ్ల తర్వాత కలుసుకుని ఆనందంగా గడిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గన్గల్ జడ్పీ ఉన్నత పాఠశాల 1992-93 సంవత్సరం చదివిన పూర్వ విద్యార్థులు తీపి జ్ఞాపకాలను మిత్రులతో పంచుకున్నారు. గున్గల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఇబ్రహీంపట్నం కేంద్రంలోని వీకే కన్వెన్షన్లో ఘనంగా నిర్వహించారు. 1992-93 విద్యా సంవత్సరం నాటి పూర్వపు విద్యార్థులు, నాటి ఉపాద్యాయులతో కలిసి ఆనందంగా గడిపారు.
వాట్సప్ వేదికగా నెల రోజులుగా మిత్రులందరూ ఒకరినొకరు పరిచయం చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహించుకున్నారు. అప్పట్లో వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను సాదరంగా ఆహ్వానించారు. చదువు అనంతరం వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఒకరోజు ముందుగానే గ్రామాలకు చేరుకున్నారు. ఎన్నో ఏండ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకుని మధుర జ్ఞాపకాలను తలుచుకుంటూ సంతోషంగా గడిపారు. వారు చదువుకు న్న రోజుల్లో కొన్ని మధుర జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ సందడి చేశారు. చదువు చెప్పిన గురువులను ఘనంగా సత్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ తమ లాంటి ఎంతో మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి, తీర్చిదిద్దిన గురువులను సన్మానిం చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురు స్నేహితులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని అదే విదంగా పాఠశాలకు అవసరమైన సామగ్రిని అందించారు. కార్యక్రమంలో భాగంగా గతంలో మృతి చెందిన గురువులు, స్నేహితులకు నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు బుగ్గయ్య, ప్రకాష్, వెంకటయ్య, కులశేకర్, అంజనేయులు, వెంకట మహాలక్ష్మి, పూర్వ విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.