Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 కిలో మీటర్లు వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకుంటున్న కుత్బుద్దిన్ గ్రామస్తులు
- గ్రామమంతా ఎస్సిలు ,ముస్లిం, మైనారిటీలే ...
- అనుబంధ గ్రామానికి ఉన్న యోగం, గ్రామ పంచాయితీకి లేదా?
- సమస్యలు విన్నవించుకున్నా పట్టించుకోని అధికారులు
- సొంత ఊర్లోనే రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలి: గ్రామస్తుల డిమాండ్
నవతెలంగాణ-మొయినాబాద్
కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు బంగారు తెలంగాణాగా అభివర్ణిస్తున్న అధికార పార్టీ వాటి ఆనవాలు కూడా ఎరగని గ్రామాలు మండల కేంద్రంలో ఉన్నాయంటే అవుననే అంటున్నారు ఆ గ్రామ వాసులు. గ్రామానికి పంచాయతీ అధికారం వచ్చి పాతికేళ్ళు గడుస్తున్నా, గతి మారని బతుకుల్తో కాలం ఎల్లదిస్తున్నారు. తిండి గింజల కోసం తిప్పలు పడుతు,యాదమరిస్తే నెలంతా పస్తులుండల్సిన దుస్థితి ఆ గ్రామ దళితులది. అధికారులు ,ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఆ గ్రామస్తుల అమాయకత్వం వారికి శాపంగా మారింది.ఇదేదో అదిలాబాద్ అడవుల్లో ఉన్న గ్రామం కాదు నగరానికి కూతవేటు దూరంలో ఉన్న, అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందంటు స్థానిక నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నా మొయినాబాద్ మండలంలోని కుత్ బుద్దిన్ గూడా గ్రామం. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ప్రొడక్ట్ ఇంటికి తెచ్చిచ్చే నయా పోకడలతో పరుగులు పెడుతున్న నాగరిక సమాజంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యం, గ్రామ దళితుల పాలిట గుదిబండగా మారింది.నాలుగు మెతుకులు గొంతులోకి పోవాలంటే నానా యాతన తప్పదంటున్నారు గ్రామస్తులు.చౌక ధరల సామాగ్రి తెచ్చుకునేందుకు ఆ గ్రామస్తుల అవస్థలు వర్ణనాతీతం. వినే వారికి పెద్ద సమస్యగా అనిపించక పోయిన ఇది గ్రామస్తులకు గుండెలనిండా మోస్తున్న భాద. గ్రామంలో వితంతు మహిళలు, వృద్ధులు ,వికలాంగులు, ఇంట్లో మగ దిక్కు లేని ఒంటరి మహిళలు,అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఇలా ఒక్కో కుటుంబంలో ఒక్కో వ్యధ.ప్రతి నెలా రేషన్ తేవాలంటే ఇబ్బంది పడాల్సిందే. రేషన్ కోసం పక్క గ్రామమైన ఎల్కాగుడాకు ఆటో, ద్విచక్ర వాహనం, అది లేనివారు కాలి నడకన వెళ్లాల్సివస్తుంది. రేషన్ కోసం వెళ్ళావలసి వస్తే పొద్దున్నే కోడికూయక ముందే ఆ గ్రామానికి చేరుకుని క్యూ లైన్ లో నిలబడాలి. లేదంటే. ఆ గ్రామస్తులు క్యూ లైన్ లో ఉంటారు.వారి తంతు ముగించి తమ వరకు వచ్చెకల్లా అమ్మటల్లా ఐతదని, వృద్ధులు కన్నీరు పర్యంతమ వుతున్నారు. ఆ తిండి గింజలు ఇచ్చాక అవి ఇంటికి చేర్చడానికి ఆటో ఉంటే కిరాయి చెల్లించాలి. లేదంటే ఎవరివైన కాళ్ళ, ఏళ్ళ పడి గింజలు ఇంటికి ముట్టజెప్పుకోవాలని ,అది లేదంటే కాలినడకన నెత్తిమీద ఎత్తుకుని ఇంటికి తెచ్చుకోవాలని ఆవేదన చెందుతున్నారు. రేపు మాపు తెద్దాం లే అనుకుంటే డీలర్ రెండు రోజులు మాత్రమే రేషన్ ఇస్తాడు.ఒక రోజు అటు ఇటు అయినా నెలంతా పస్తులుండాల్సి వస్తుందని గ్రామస్తులు వెల్లబోసుకుంటున్నారు. నేటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నామని ప్రగల్బాలు పలుకుతూ గొప్పలు చెబుకుంటుంది. కానీ అనుబంధ గ్రామం కంటే ఆధ్వనపు బతుకులు బతుకుతున్నారు కుత్ బుద్దిన్ గ్రామ ప్రజలు. నేటికి గ్రామ పంచాయతీ అయ్యి ఐదుగురి సర్పంచ్ల హాయంలో పాలన జరిగిన ఆ గ్రామంలో పూర్తిగా ఎస్సి, ముస్లిం మైనారిటీ దళితులు ఉన్నం దున ఎదురించే వాడు లేనందున బెదిరించే వారిది రాజ్యమైందని గ్రామస్తులు ఉసూరు మంటున్నారు. ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమయంలో మాత్రమే తమ ఇండ్ల చుట్టూ, తిరుగుతారని,తరువాత తమవైపు కన్నెత్తి చూడరని విమర్శిస్తున్నారు. బంగారు తెలంగాణా అని ప్రజా ప్రతినిధులు, టీవీల్లో, బహిరంగ సభల్లో చెబుతుంటారు గాని,తమ బతుకుల్లో మార్పు రాలేదని స్పష్టం చేస్తున్నారు. అనుబంధ గ్రామనికి ఉన్న యోగం తమ పంచాయతీకి లేదా అని నిలదీస్తున్నారు.అధికారులకు, ప్రజా ప్రతినిధులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి, తమ గ్రామంలోనే రేషన్ అందించే విధంగా కృషి చేయాలని కోరారు.
పిల్లలు భిక్షాటన చేస్తుంటే భరించలేకపోతున్న
రెండేండ్ల క్రితం అనారోగ్యంతో తన కాలు తీసేశారు. భార్య మృతి చెందింది.ముగ్గురు పిల్లలు (ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి)చిన్న పిల్లలు. ప్రతి నెలా చేతి వేలు పెడితేనే రేషన్ ఇస్తామంటే ,ఆటో కట్టుకుని ఆ గ్రామానికి పోయి క్యూలో నిలబడి రేషన్ తెచ్చు కుంటాను. ఒక ఏడాది ఆరోగ్యం కుదుట లేక తెచ్చేందుకు అవస్థలు పడి రేషన్ వదిలేసుకున్నా. పిల్లలు గ్రామంలో భిక్షాటన చేసి పొట్ట నింపుకోవడం భరించలేక ఆటో కిరాయికి మాట్లాడుకుని రేషన్ తెచ్చుకుంటున్న.ప్రతి నెలా ఉచిత రేషన్ కాదు.డబ్బులు పెట్టి కొనుక్కునట్టే అవుతుంది.ఆ రేషన్ తమ గ్రామంలో ఇప్పించే విధంగా అధికారులు కృషి చేయాలని కోరుతున్న.
- కంతి రమేష్ కుత్ బుద్దిన్ గ్రామస్తులు
మానసిక వైకల్యంతో బరువు మోసుకురావడం ఇబ్బందిగా ఉంది
తన కొడుకు నేను ఇద్దరికి ఒక కార్డు ఉంది.కొడుకు మానసిక వైకల్యం ఉంది.ప్రతి నెలా ఎల్కాగుడా వెళ్లి రేషన్ తేవాలంటే కష్టమవుతుంది. ఆ బరువు మోసుకుని రావాడం ఇబ్బందిగా ఉంది. పొట్ట కూటి కోసం కష్టం తప్ప మరో దిక్కు లేదని మోసుకొస్తున్న. బరువైతే అడడా చెట్టు కింద కూసోని ఇంటికి చేరుతా.ఆటోలు పొద్దుగాళ్ల పూటనే ఉంటాయి.మధ్యాహ్నం ఏమి ఉండవు.నడుచుకుంటునే రావాలి. ఇప్పటికైనా ఎమ్మెల్యే సార్ మాపై దయ తలచి సమస్యా పరిష్కారిస్తారని ఆశిస్తున్నా.
- ఊరెల్లా ఎల్లమ్మ గ్రామస్తురాలు
రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలి
అనారోగ్యంతో బాధపడుతున్న (హార్ట్ పేషెంట్)ను అయినా తన వేలిముద్ర పెడితేనే బియ్యం వస్తాయి. అందుకు ఆటో కట్టుకుని వస్తాను.ఉదయం వస్తే ఒక్కోసారి మధ్యాహ్నం,సాయంత్రం కూడా అవుతుంది. రేషన్ మా ఊళ్ళోనే ఇస్తే ఎవరితోనైనా ఇంట్లోకి తీసికెళ్లవచ్చు. పక్క ఊరు ఎవరు సాయం చేయరు.అందరికి పనులున్నాయని వెళ్లి పోతారు.ఎమ్మెల్యే సర్,ఆర్డీఓ తమ సమస్య పరిష్కారిస్తారని అధికారులు చెబుతున్నారు. పరిష్కరించాలని కోరుతున్నాం.
- నసిరుద్దీన్ ,గ్రామస్తులు
దళితుల సమస్య పరిష్కరించాలి
మండలంలోని అన్ని గ్రామాల్లో రేషన్ దుకాణాలు ఉన్నాయి. చిన్న చిన్న అనుబంధ గ్రామాల్లో కూడా రెషన్ దుకాణాలు ఉన్నాయి. కానీ తమ గ్రామానికి గ్రామ పంచాయతీ అయ్యి పాతికేళ్ళు గడుస్తున్నా రేషన్ దుకాణం లేదు.మా ఊళ్ళో డిగ్రీలు, ఆపై చదివిన వారు ఉన్నారు. డీలర్‌గా రాణించేందుకు అర్హులు ఉన్నారు.గ్రామ సమస్య తీర్చడానికి గ్రామ యువత సిద్ధంగా ఉన్నారు. అవకాశం కల్పించండి.ఏండ్ల తరబడి అవస్థలు పడుతున్నాం. గ్రామ దళితుల సమస్య పరిష్కారానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని కోరుతున్నాం.
- ప్రభాకర్ టీఆర్ఎస్ నాయకులు,మాజీ గ్రామ వార్డు సభ్యులు