Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీగా తరలివచ్చిన ప్రజలు
నవతెలంగాణ-రాజేంద్రనగర్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడోయాత్ర మంగళవారం రాజేంద్రనగర్ సర్కిల్లో విజయవంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటల నుంచి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని గగన్ పహాడ్లోకి పాదయాత్ర ప్రవేశించింది. అక్కడ నుంచి బుద్వేల్, ఆరంగర్, శివరాంపల్లి, హసన్ నగర్ మీదుగా బహదూర్ పుర నియోజకవర్గంలోకి పాదయాత్ర వెళ్లింది. ఉదయం పాదయాత్రలో రాహుల్ గాంధీ బుద్వేల్ ప్రాంతంలో టీ తాగి, అక్కడ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రధాన ద్వారం నుంచి వెళ్లుతుండగా అక్కడ యూనివర్సిటీ విద్యార్థులను రాహుల్ గాంధీ కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆరంగర్ చౌరస్తాలో చిన్నారులు ప్రదర్శించిన కరాటే విన్యాసాలను రాహుల్ గాంధీ ఆసక్తిగా తిలకించారు. భరత్ నగర్లో మొగులమ్మ, నరసమ్మ వృద్ధ మహిళలతో మాట్లాడి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసు కున్నారు. ఆ వృద్ధ మహిళలు 'పింఛన్ రావడం లేదని' రాహుల్ గాంధీకి తెలిపారు. రాహుల్ గాంధీని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో పాతబస్తీకి వెళ్లే పలు రహదారులు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. రాహుల్ పాదయాత్ర సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. రాహుల్ పాదయాత్రలో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, బట్టి విక్రమార్క్, ఉత్తంకుమార్ రెడ్డి, మధుయాష్కి తదితరులు పాల్గొన్నారు.