Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా సమస్యలపై ప్రజలకు జవాబు దారి ఏది?
- మండల సర్వసభ్యుల సమావేశంలో అధికారులను నిలదీసిన సభ్యులు
నవతెలంగాణ-కందుకూరు
ప్రభుత్వ భూములలో అక్రమార్కులు నల్లమట్టి, ఎర్రమట్టి, తరలిస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం ఏం చేస్తుందని, సభ్యులు నిలదీశారు. శుక్రవారం కందుకూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మంద జ్యోతి అధ్యక్షతన కందుకూరు మండల సర్వేసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సభ్యులు పలు అంశాలపై సంబంధిత అధికారులను నిలదీశారు. కందుకూరు మండల్ లేమూరు గ్రామ ప్రభుత్వ భూమిలో, సర్వేనెంబర్ 102 లో, గత కొన్ని రోజుల నుంచి జెసీబీ లతో హిటాచిలతో తవ్వి, టిప్పర్లలో తరలిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తున్నారని లేమూరు ఎంపీటీసీ మంచాల యాదయ్య రెవెన్యూ అధికారులను నిలదీశారు. రెవెన్యూ యంత్రాంగం మామూళ్లకు లోబడి, కొంతమంది బ్రోకర్ల ద్వారా ఈ మట్టి తరలిస్తున్నట్టు తమ దగ్గర సమాచారం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తరలిస్తున్న నిర్వాహకులపై నిఘా ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కందుకూరు మండల కేంద్రంలో చాలా కాలం నుంచి పందులు స్వైరా విహారం చేస్తున్నాయని, పందుల నివారణకు మండల అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ పందుల వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లపైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చిన్నపిల్లలు భయపడుతున్నారని, అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కందుకూరు మండల కేంద్రం కొత్తగూడ గ్రామపంచాయతీ ఆవరణలో కస్తూర్బా పాఠశాల దగ్గర ,కుక్కల దొడ్డి ఏర్పాటు చేశారని , తద్వారా కస్తూర్బా పాఠశాల విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారనీ, వెంటనే కుక్కల దొడ్డి తరలించాలని కొత్తగూడ సర్పంచ్ సాదా మల్లారెడ్డి సభా దృష్టికి తీసుకువచ్చారు. రాత్రి వేళ్లలో కుక్కలు ఇండ్లలోకి వస్తున్నాయని, కాలినడకన వెళ్లే వారిని, కరవడానికి వెళ్తున్నాయని, వెంటనే నివారించాలని డిమాండ్ చేశారు. మండలంలో కొంతమందికి ఆసరా పింఛన్లు మంజూరు చేసి, కార్డులు పంపిణీ చేశారు.కానీ పింఛన్ డబ్బులు రావడం లేదని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు.గ్రామాల్లో మమ్ములను ప్రజలు నిలదీస్తున్నారనీ, అధికారులు స్పందించాలని కోరారు. సభ్యులు వివిధ అంశాలపై అధికారులను నిలదీశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశాలలో లేవనెత్తిన ప్రశ్నలకు,జవాబులు రావడం లేదని సభ్యులు ఆరోపించారు. 35 మంది సర్పంచులకు గాను పదిమంది హాజరయ్యారు. 16 మంది ఎంపీటీసీలకు 11 మంది హాజరయ్యారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సమావేశలకు రాని సర్పంచులు, ఎంపీటీసీలు ,గ్రామాలలో అభివృద్ధి పనులు ఎం చేస్తారని వివిధ పార్టీల సభ్యులు ఆరోపిస్తున్నారు. సర్వసభ్య సమావేశాన్ని సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం మార్కెటింగ్ చైర్మెన్ సురసాని సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ కపాటి పాండురంగారెడ్డి, సింగల్ విండో చైర్మెన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి, తహసీల్దార్ మహేందర్రెడ్డి, ఎంపీడీవో వెంకట్ రాములు, వివిధ శాఖల అధికారులు సర్పంచులు ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, పాల్గొన్నారు.